ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు ఉన్నాయనేది వాస్తవం. దాన్ని ఆయుధంగా మలుచుకోవాలని, ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయాలని ప్రతిపక్షాలన్నీ తమకు తోచిన రీతిలో ఎత్తులు పన్నుతున్నాయి. నారా లోకేష్ లాంటోళ్లు ఇప్పటికే చేతిలో లాంతర్లు పట్టుకొని రోడ్లపై తిరగడం మొదలుపెట్టారు. కాస్త లేటుగా దిగినా, లేటెస్ట్ గా పబ్లిసిటీ కొట్టేయాలని చూస్తోంది జనసేన పార్టీ.
ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఊరూవాడా నిరసన కార్యక్రమాలు చేస్తోంది జనసేన. అయితే ఈ క్రమంలో తమ నాయకుడి దృష్టిలో పడాలని, జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఫోటోలు కనిపించాలనే అత్యుత్సాహంతో కొంతమంది జనసేన నేతలు చేసిన ప్రయత్నాలు వికటించాయి. దీంతో పార్టీ పరువు గంగలో కలిసింది.
ఇంతకీ ఏం చేశారు..?
నరసాపురంలో జనసేన పార్టీ శ్రేణులు హంగామా చేయాలని చూశాయి. పెరిగిన కరెంట్ ఛార్జీలు, విద్యుత్ కోతలపై నిరసన చేపట్టాలనుకున్నాయి. మామూలుగా పగటి పూట ఇలాంటి నిరనస కార్యక్రమాలు చేస్తే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ నరసాపురం జనసైనిక్స్ మాత్రం సరిగ్గా కరెంట్ కోత ఉన్నప్పుడు, రాత్రి పూట ఈ నిరసన చేయాలని నిర్ణయించాయి. మరి ఇలా చేయాలంటే తాము నిరసన చేసే టైమ్ లో కరెంట్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయినట్టే.
అందుకే నరసాపురం జనసైనికులు ఓ ఎత్తుగడ వేశారు. తాము ఏ రోడ్డులో నిరసన చేపట్టాలనుకుంటున్నారో, ఆ గల్లీలో ఉన్న షాపులన్నింటినీ లైట్లు ఆపేయాలని హుకుం జారీచేశారు. ఆల్రెడీ వీధి లైట్లు ఆపేశారు. ఇక చూస్కోండి.. సైనికుల డ్రామా మొదలైంది. క్యాండిల్స్, లాంతర్లు, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి బ్యానర్లు కట్టి నినాదాలు మొదలుపెట్టారు.
అయితే అంతలోనే ఓ షాపులో ఓనర్ లైట్లు వేశాడు. దీంతో ర్యాలీలో ఉన్న వ్యక్తి “బాబు.. లైట్లు ఆపాలి, ముందే చెప్పాం కదా” అంటూ మైక్ లోనే అరవడం, సరిగ్గా అదే సన్నివేశాన్ని ఎవరో షూట్ చేయడం, ఆ వీడియో వైరల్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ ఒక్క వీడియోతో జనసైనికులు ఆడిన డ్రామా బయటపడిపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలున్నాయనేది వాస్తవం. దానికి సంబంధించి నిజాయితీగా నిరసన చేపడితే బాగుండేది, కానీ తమ అధ్యక్షుడి దృష్టిలో పడాలని, వినూత్నంగా ఏదో చేయాలని ప్రయత్నించి ఇలా బొక్కబోర్లాపడ్డారు జనసైనికులు.