కొత్త కేబినెట్లో ఎవరెవరికి చోటు లభించిందన్న విషయమై మరి కాసేపట్లో తెలియనుంది. అయితే కేబినెట్‌కు సంబంధించి రకరకాల పేర్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ నాయకుడికి మంత్రి పదవి దక్కని పక్షంలో మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు హెచ్చరిస్తున్నారు. కేవలం వార్నింగ్ ఇవ్వడమే కాదు, ఆచరణకు కూడా దిగారు.
మాచర్ల మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు పార్టీ పదవులకు రాజీనామాకు సిద్ధపడడం వైసీపీలో కలకలం రేపుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతున్నారు.
నాలుగోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజల్లో పలుకుబడి కలిగిన నాయకుడు. సీనియర్ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లిని కాదని మరెవరికో మంత్రి పదవి కట్టబెడితే సహించేది లేదని ఆయన అనుచరులు హెచ్చరిస్తున్నారు.
ఇవాళ మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కుల సమీకరణల్లో భాగంగా పిన్నెల్లికి మంత్రి యోగం దక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధిష్టానానికి వార్నింగ్ పంపడం విశేషం.
కాసేపట్లో విడుదల కానున్న నూతన మంత్రివర్గ జాబితాలో పిన్నెల్లి పేరు లేకపోతే… రాజకీయ పరిణామాలు ఏంటో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.