యెడుగూరి సందింటి కుటుంబంతో తన పదహారో ఏట నుంచే 34 ఏళ్ళ పాటు సుదీర్ఘ ఆత్మీయానుబంధం,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆదరంగా 'భాస్కర్' అని పిలుచుకోగలిగినంతటి సుహృద్భావ సాన్నిహిత్యం,
వీర హనుమాన్ లా పార్టీకోసం ప్రాణాలకు తెగించి పనిచేసే త్యాగ నిరతి,
పార్టీని ప్రజలకు చేరువ చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరవాత అంత క్రియాశీలంగా వ్యవహరించే చొరవ,
అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా పార్టీ కార్యకర్తలు అన్నా అని పిలిస్తే 'నేనున్నా” అని పలికే నాయకత్వ దక్షత,
సీనియర్ శాసన సభ్యుడిగా ప్రజా క్షేత్రంతో విస్తృత సంబంధాలు,
అధినేత కుటుంబంతో 30 ఏళ్ళ అనుబంధం, ఉన్నత విద్యార్హతలు, సమర్థత గల ఒక నాయకుడిని సాధారణంగా మంత్రి పదవి అలవోకగా వరిస్తుంది…
నిజానికి క్యాబినెట్ లో బెర్త్ సంపాదించేందుకు ఇంతకు మించిన అర్హతలూ బహుశా అవసరంలేదేమో…
వైఎస్ కుటుంబమే ప్రాణంగా, పార్టీయే సర్వస్వంగా భావించే చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి గురించే ఇదంతా…
రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుతం నేపథ్యంలో, సామాజిక సమీకరణలు, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య ఎవరికి పదవి ఇవ్వాలో, ఎవరికి ఎలా సర్ది చెప్పాలో తెలీక పార్టీ అధిష్టానం సతమతమవుతున్న తరుణంలోనూ… జాబితాలో కచ్చితంగా ఉండగల, ఉండదగిన పేరు అని అందరూ భావించింది మాత్రం చెవిరెడ్డి భాస్కర రెడ్డి గురించే. పార్టీ నాయకత్వం సైతం ఇంచుమించుగా అదే ఆలోచనతో ఉందనీ వార్తలు వెలువడ్డాయి.
చెవిరెడ్డి కి ఈసారి క్యాబినెట్ లో బెర్త్ ఖాయమనే సంకేతాలే బలంగా వినిపించాయి. సర్వత్రా సానుకూలత కనిపిస్తున్న, వినిపిస్తున్న ఈ తరుణంలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి విలక్షణంగా స్పందించారు. అధిష్టానాన్ని కలిసి తాను నిబద్దత కలిగిన సైనికుడిగానే ఉంటానని, మంత్రివర్గ జాబితాలో తన పేరును దయచేసి పరిశీలనలోకి తీసుకోవద్దని విన్నవించుకోవడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో చూద్దాం!
నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని చంద్రగిరి శాసన సభ్యులు కలుసుకున్నారు. మరో మూడు రోజుల్లో నూతన మంత్రివర్గాన్ని నిర్ణయించాల్సిన తరుణంలో పార్టీ అధిష్టానం జాబితాలో పేర్లపై చర్చోపచర్చలు జరుపుతున్న సందర్భమిది. సరిగ్గా ఈ సందర్భంలోనే చెవిరెడ్డి సీఎంఓ లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం కావడంతో సహజంగానే అందరూ…. ఆయన మంత్రివర్గంలో చోటు పదిలపర్చుకునేందుకే వచ్చారని భావించారు. కానీ ముఖ్యమంత్రిని కలిసిన చెవిరెడ్డి అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ భిన్నమైన ఆకాంక్షను వెలిబుచ్చారు.
మంత్రివర్గంలో చోటుకోసం విపరీతమైన పోటీ నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో తాను స్వచ్ఛందంగా ఆ పోటీనుంచి తప్పుకుంటున్నానని, తనకు బదులుగా ఆశావహుల్లో సమర్థులెవరికైనా చోటు కల్పించాలని ముఖ్యమంత్రిని కలిసిన చెవిరెడ్డి విన్నవించుకున్నారు. మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పించినా వారితో కలిసి ఉద్యమస్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికోసం జగనన్న సారథ్యంలో కలిసి పనిచేస్తానని ఆయన వెల్లడించారు. నిబద్దమైన పార్టీ కార్యకర్తగా కొత్త మంత్రులతో భుజం భుజం కలిపి సమన్వయంగా పనిచేయడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.
కలిసిన ప్రతి ఒక్కరూ తనకు ఏదో ఒక పదవి కావాలని మంకు పట్టు పడుతున్న తరుణంలో… చెవిరెడ్డి చేసిన విజ్ఞతాయుత విజ్ఞప్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అమిత ఆశ్చర్యానందాలకు లోను చేసింది. కుల వర్గ ప్రాంతీయ సమీకరణల్లో మంత్రివర్గ కూర్పు అత్యంత సంక్లిష్ట ప్రక్రియగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో… అధినేతకు తన రూపంలో అదనపు భారం ఎదురుకాకూడదన్న పరిణతితో చెవిరెడ్డి స్వచ్చందంగా చేసిన విజ్ఞప్తి ముఖ్యమంత్రిని అమితానంద పరిచినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గంలో చోటుకోసం పరితపిస్తున్న అనేకమందికి చెవిరెడ్డి తీరు- ఒక సానుకూల సంకేతాన్ని పంపినట్లైంది. పార్టీ ప్రయోజనాలే పరమావధి అన్న స్పష్టమైన అవగాహనను ఆచరణలో చూపిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి, మంత్రి పదవికి తన పేరును పరిశీలనలోకి తీసుకోవద్దని ముఖ్యమంత్రిని కలిసి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేయడం ద్వారా రాజకీయాల్లో బాధ్యతాయుత ఒరవడికి శ్రీకారం చుట్టారు.