ఉత్తరాంధ్రా ఆరు జిల్లాలుగా మారింది. అయితే కొత్త మంత్రి వర్గం ఈ నెల 11న కొలువు తీరబోతోంది. దాంతో కొలువు తీరనున్న మంత్రుల జాబితా ఏంటి అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఆ ప్రకారం చూస్తే ఆరుగురు మంత్రులు కొత్తగా ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి వస్తున్నారు అని అంటున్నారు.
వారెవరు అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, సీదరి అప్పలరాజు మంత్రులు అవుతున్నారు. ఇక విజయనగరం నుంచి చూసుకుంటే బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొరలను నూతన మంత్రులుగా చూడవచ్చు.
అదే విధంగా అనకాపల్లి జిల్లా నుంచి గుడివాడ అమరనాధ్, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కె భాగ్యలక్ష్మి ఫస్ట్ టైమ్ మంత్రులు అవుతున్నారు. ఈ మొత్తం కూర్పులో ఉత్తరాంధ్రా నుంచి నలుగురు బీసీలు, ఇద్దరు ఎస్టీలకు స్థానం దక్కుతోంది.
అదే విధంగా చూసుకుంటే విభజనలో చిన్నదిగా మారిన విశాఖ జిల్లాకు మాత్రం స్థానం దక్కడంలేదు అని పక్కాగా చెప్పుకోవాల్సిందే. ఇక మొత్తం ఆరుగురు మంత్రులలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని చెబుతున్నారు. మరి ఆ డిప్యూటీలు ఎవరో మరి కొద్ది గంటలలో తేలనుంది. ఏది ఏమైనా ఉత్తరాంధ్రాకు ఈసారి కూర్పులో పెద్ద పీట వేశారనే అనుకోవాలి.