జీఆర్ మ‌హ‌ర్షిః త‌మిళ‌సై రెండు త‌ప్పులు

పెద్ద జైళ్ల‌లో ఉరితీసే వాళ్లుంటారు. వాళ్ల‌ని త‌లారి లేదా హ్యాంగ్‌మాన్ అంటారు. వాళ్ల‌కి రెగ్యుల‌ర్‌గా ప‌ని వుండ‌క‌పోయినా జీత భ‌త్యాలు ఇస్తూ వుంటారు. ఖైదీని ఉరి తీయాల్సి వ‌చ్చిన‌పుడే వాళ్ల ఇంపార్టెన్స్ మ‌న‌కి తెలుస్తుంది.…

పెద్ద జైళ్ల‌లో ఉరితీసే వాళ్లుంటారు. వాళ్ల‌ని త‌లారి లేదా హ్యాంగ్‌మాన్ అంటారు. వాళ్ల‌కి రెగ్యుల‌ర్‌గా ప‌ని వుండ‌క‌పోయినా జీత భ‌త్యాలు ఇస్తూ వుంటారు. ఖైదీని ఉరి తీయాల్సి వ‌చ్చిన‌పుడే వాళ్ల ఇంపార్టెన్స్ మ‌న‌కి తెలుస్తుంది.

ఇవే వాక్యాల్ని ప్ర‌జాస్వామ్య భాష‌లో చెప్పుకుంటే ప్ర‌తి రాష్ట్రానికీ ఒక గ‌వ‌ర్న‌ర్ వుంటారు. ఆ ప్ర‌భుత్వాల్ని వురి తీయాల్సి వ‌చ్చిన‌పుడే వాళ్ల అస‌లు ప‌వ‌ర్‌ అర్థ‌మ‌వుతుంది.

రాజ్యాంగ సంక్షోభం వ‌స్తే శాంతిభ‌ద్ర‌త‌లు కాపాడ్డానికి , ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించ‌డానికి రాష్ట్రప‌తి వ్య‌వ‌స్థ వుంది. మెజార్టీ లేక ప్ర‌భు త్వాలు ప‌డిపోతున్న‌పుడు రాష్ట్ర‌ప‌తి నిర్ణ‌య‌మే కీల‌కం. జ‌న‌తా ప్ర‌భుత్వంలో సంక్షోభం వ‌స్తే ద‌ళిత నాయ‌కుడు జ‌గ‌జ్జీవ‌న్‌రామ్‌కి ప్ర‌భుత్వ ఏర్పాటు అవ‌కాశం రాష్ట్ర‌ప‌తి నీలం సంజీవ‌రెడ్డి ఇవ్వ‌లేదు. బ‌స్సు రూట్‌ల జాతీయంపై సుప్రీంకోర్టు త‌న‌కి వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చింద‌నే చిన్న‌ కార‌ణంతో 1964లో ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకున్న వ్య‌క్తి నీలం. కానీ రాజ‌కీయ చివ‌రి ద‌శ‌లో ద‌ళిత వ్య‌తిరేక నింద‌ని మోస్తూ ప్ర‌యాణం ముగించాడు.

ఫ‌క్రుదీన్ ఆలీ అహ‌మ్మ‌ద్ కూడా ఎమ‌ర్జెన్సీపై సంత‌కం చేసి నింద‌ని మోసారు. రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్‌ల ప‌ద‌వీ కాలం ఒక్కోసారి సాఫీగా గ‌డుస్తుంది. కొన్నిసార్లు సంఘ‌ర్ష‌ణ‌ల‌తో న‌డుస్తుంది.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఇదే. ఇక్క‌డ సంఘ‌ర్ష‌ణ అనివార్యం. కెసీఆర్ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి బీజేపీ అనుకుంటున్న‌పుడు త‌మిళిసైతో స‌ఖ్య‌త అసాధ్యం. అదే విధంగా బీజేపీ వ్య‌తిరేక ముఖ్య‌మంత్రిని ఇబ్బందులు పెట్టక‌పోతే గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ వేస్ట్‌. కేసీఆర్ వైపు నుంచి ప్రొటోకాల్ లోపాలు జ‌రిగింది వాస్త‌వ‌మే. ఒక ర‌కంగా క‌క్ష సాధింపు కూడా. అయితే త‌మిళిసై రెండు త‌ప్పులు చేసారు. 

గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ ఎంపిక‌లో గ‌వ‌ర్న‌ర్ పాత్ర నామ‌మాత్ర‌మే అని ఆమెకి తెలియందికాదు. అయినా కౌశిక్‌రెడ్డికి ఆమోదం తెల‌ప‌లేదు. అనుకుంటే ప్ర‌భుత్వం కూలిపోయేద‌ని అన‌డం రెండో త‌ప్పు. తెలంగాణ రాష్ట్రం ప్ర‌జ‌ల ఆకాంక్ష‌తో ఏర్ప‌డింది. కేసీఆర్ ప్ర‌జ‌లు ఎన్నుకున్న ముఖ్య‌మంత్రి. గ‌వ‌ర్న‌ర్ వ‌చ్చి ఏవో నిబంధ‌న‌ల పేరుతో కూలిస్తే ప్ర‌శాంతంగా వున్న రాష్ట్రం భ‌గ్గుమ‌నేది. ఈ విష‌యం ఆమెకి తెలియంది కాదు. అయినా నా చేతిలో ప‌వ‌ర్ వుంది అని హెచ్చ‌రించ‌డం గ‌వ‌ర్న‌ర్ ఆంత‌ర్యం.

వెనుక‌టికి 1984లో ఎన్టీఆర్ ప్ర‌భుత్వాన్ని గ‌వ‌ర్న‌ర్ రాంలాల్ కూల్చి చెడ్డ‌పేరు తెచ్చుకున్నాడు. విచిత్రం ఏమంటే అదే రాంలాల్ నేష‌న‌ల్ ఫ్రంట్ హిమాచల్ ప్ర‌దేశ్ నాయ‌కుడిగా ఫిరాయిస్తే ఎన్టీఆర్ ఆయ‌న‌తో ఢిల్లీలో చేతులు క‌లిపి ఫొటోల‌కి పోజులిచ్చాడు. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ ర‌ద్దు చేయాల‌ని బండ‌బూతులు తిట్టిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత వీపీసింగ్ ప్ర‌ధాని వున్న‌పుడు కూడా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ ర‌ద్దు కోర‌లేదు. 

కేంద్ర‌మంత్రిగా, ఎంపీగా ఢిల్లీలో వున్న కేసీఆర్ కూడా ఎపుడూ పెద‌వి విప్ప‌లేదు. నొప్పి త‌గిలితే అంద‌రూ గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ని తిట్టేవాళ్లే. అంతా బావుంటే తాము గ‌వ‌ర్న‌ర్లుగా వెళ్ల‌డానికి, త‌మ వాళ్ల‌ని నామినేట్ చేయించ‌డానికి వీళ్లే ఢిల్లీ క్యూ క‌డ‌తారు.
రాజ‌కీయ నాయ‌కుల మాట‌ల‌కి అర్థాలు వేరులే!

-జీఆర్ మ‌హ‌ర్షి