జ‌గ‌న్ ఫోన్ కోసం నిరీక్ష‌ణ‌

అన‌ధికారికంగా త‌మ పేరు కేబినెట్‌లో ఉంద‌ని వివిధ మీడియా సంస్థ‌లు ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ, అధికారిక స‌మాచారం కోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. సోమ‌వారం నూత‌న కేబినెట్ ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్…

అన‌ధికారికంగా త‌మ పేరు కేబినెట్‌లో ఉంద‌ని వివిధ మీడియా సంస్థ‌లు ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ, అధికారిక స‌మాచారం కోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు. సోమ‌వారం నూత‌న కేబినెట్ ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. రెండు మూడు రోజులుగా కేబినెట్ కూర్పుపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర క‌స‌రత్తు చేశారు. ఎట్ట‌కేల‌కు ఇవాళ మ‌ధ్యాహ్నానికి ఒక కొలిక్కి వ‌చ్చింది.

ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చెప్పారు. కేబినెట్ కూర్పులో భాగంగా ప‌లు ద‌ఫాలు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని జ‌గ‌న్ పిలిపించుకుని ప‌లువురు ఎమ్మెల్యేల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టికే మంత్రుల రాజీనామాలు గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యానికి చేరాయి. వాటిని ఆమోదించ‌డం, ఆ త‌ర్వాత కొత్త మంత్రుల పేర్లు ఆయ‌న చెంత‌కు చేర‌డ‌మే త‌రువాయి.

మంత్రి వ‌ర్గ కూర్పుపై సజ్జ‌ల మీడియాతో మ‌రోసారి మాట్లాడారు. సామాజిక స‌మ‌తుల్య‌త ఉండేలా కొత్త కేబినెట్ వుంటుంద‌ని స‌జ్జ‌ల చెప్పారు. సామాజిక స‌మీక‌ర‌ణాలు, ప్రాంతాల‌ను బ‌ట్టి అంద‌రినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని తుది ఎంపిక జ‌రిగింద‌ని ఆయ‌న అన్నారు. సీఎం జ‌గ‌న్ ఎంపిక చేసిన మంత్రుల జాబితాను సాయంత్రం ఆరు గంట‌ల త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌కు సీల్డ్ క‌వ‌ర్‌లో పంపుతున్న‌ట్టు స‌జ్జ‌ల చెప్పారు. 

మంత్రి ప‌ద‌వులు పొంద‌నున్న ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ స్వ‌యంగా ఫోన్ చేసి స‌మాచారంతో పాటు అభినందించ‌నున్న‌ట్టు స‌జ్జ‌ల పేర్కొన‌డం విశేషం. స‌జ్జ‌ల మాట‌ల‌తో జ‌గ‌న్ ఫోన్ కోసం వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్కంఠంతో ఎదురు చూడ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.