చిలకలూరిపేట ఎమ్మెల్యే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ అమాత్య పదవిని దక్కించుకున్నారు. వైసీపీలో అత్యంత అదృష్టవంతురాలు ఎవరని ప్రశ్నిస్తే… విడదల రజినీ పేరే చెబుతారు. 2018వ సంవత్సరం ఆగస్టు 24న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే రోజు ఆ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమితులయ్యారు. ఇక్కడ నుంచి సాగిన ఆమె రాజకీయ అదృష్ట ప్రస్థానం మంత్రి పదవి వరకూ నిరాటంకంగా సాగింది.
31 ఏళ్లకే మంత్రి పదవి దక్కించుకున్న అదృష్టజాతకురాలిగా విడదల రజినీ ఏపీ రాజకీయ చరిత్రకెక్కారు. బీసీ (డీ) సామాజిక వర్గానికి చెందిన ఆమె రాజకీయం అంచెలంచెలుగా ఎదుగుతోంది. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పురుషోత్తమ పట్టణం ఆమె స్వస్థలం. విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ కంప్యూటర్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేశారు. ఆమెది కులాంతర వివాహం. కాపు సామాజిక వర్గానికి చెందిన విడదల కుమారస్వామితో వివాహం రజినీ జీవితాన్ని మలుపు తిప్పింది.
ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లారు. సొంతంగా అమెరికాలో ప్రాసెసర్ వీవర్ అనే బహుళజాతి సంస్థను స్థాపించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తూ… అక్కడే ప్రాసెస్ వీవర్ కంపెనీకి డైరెక్టర్, బోర్డు మెంబర్‌గా సేవలు అందించారు. జన్మనిచ్చిన గడ్డ రుణం తీర్చుకోవాలనే ఆశయానికి భర్త కుమారస్వామి ప్రోత్సాహం తోడైంది. దీంతో వీఆర్ ఫౌండేషన్‌ను నెలకొల్పారు.
చిలక లూరిపేటతో పాటు పరిసర ప్రాంతంలో పేద ప్రజలకు మంచినీరు అందించారు. అలాగే , పేద పిల్లలకు స్కాలర్‌షిప్పులు పంపిణీ చేయడం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం తదితర కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేశారు.
మొదట టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటికీ, ఆ తర్వాత కాలంలో జగన్ పోరాట స్ఫూర్తికి ముగ్ధురాలయ్యారు. 2018, ఆగస్టు 24 నుంచి వైసీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. 2019లో చిలకలూరి పేట నుంచి ఎమ్మెల్యే గా వైఎస్ జగన్ ప్రోత్సాహంతో పోటీ చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి కంచుకోటగా అంత వరకూ పేరున్న నియోజకవర్గంలో మొదటి బీసీ మహిళాగా బరిలో నిలబడడం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఎదుర్కోవడం మహిళగా ఆమెకు సవాల్‌గా నిలిచింది.
సవాళ్లన్నింటిని ఎదుర్కొని ప్రత్తిపాటి పుల్లారావుపై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచిన తొలి బీసీ మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎమ్మెల్యేగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే గెలుపొందడం గమనార్హం!. ప్రస్తుత ఏపీ 15వ అసెంబ్లీలో అత్యంత పిన్న వయస్కురాలిగా ఎమ్మెల్యే విడదల రజినీ నిలిచారు.
వైసీపీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్ధండులు ఉన్నప్పటికీ, సోదరిగా జగన్ మనసు చూరగొని మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజినీ …సీఎం నమ్మకాన్ని నిలుపుకోవాలని ఆశిద్దాం.