సూర్యాపేటలో కలకలం.. నడిరోడ్డుపై హత్యాయత్నం

సూర్యాపేటలో మర్డర్లు కొత్త కాదు. తాజాగా మరో హత్యాయత్నం జరిగింది. ఏకంగా జిల్లా కేంద్రంలో, తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా ఓ వ్యక్తిపై నలుగురు విరుచుకుపడ్డారు. కత్తిపోట్లు పొడిచారు, రాయితో తలపై బాదారు. మొత్తం…

సూర్యాపేటలో మర్డర్లు కొత్త కాదు. తాజాగా మరో హత్యాయత్నం జరిగింది. ఏకంగా జిల్లా కేంద్రంలో, తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా ఓ వ్యక్తిపై నలుగురు విరుచుకుపడ్డారు. కత్తిపోట్లు పొడిచారు, రాయితో తలపై బాదారు. మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

రద్దీ కాస్త తక్కువగా ఉంది. బక్రీద్ కావడంతో మార్కెట్లో పెద్దగా సందడి లేదు. ఉన్నట్టుండి సడెన్ గా కొంతమంది తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు దూసుకొచ్చారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డారు. కత్తితో 9 పోట్లు పొడిచారు. రెండుసార్లు రాయితో మోదారు.

అప్పటివరకు ఏం జరుగుతుందో అర్థంకాక బిత్తరపోయిన స్థానికులు ఒక్కసారిగా తేరుకున్నారు. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాడిన కత్తిని, తీసుకొచ్చిన బైక్ ను అక్కడే వదిలేసి పారిపోయారు దుండగులు. ఈ మొత్తం వ్యవహారం సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరనేది స్పష్టంగా ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఈ దాడిలో సంతోష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని హుటాహుటిన స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దాడిచేసిన వ్యక్తిని బంటీగా గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వీళ్లిద్దరూ ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్.

కొన్నేళ్ల కిందట సంతోష్-బంటీ మంచి ఫ్రెండ్స్. కలిసి తిరిగేవాళ్లు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. కొన్ని వివాదాలపై కోర్టు కేసులు కూడా పడ్డాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య శత్రుత్వం ఎక్కువైంది. అలా పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు బంటీ పోలీసుల అదుపులో ఉన్నాడు.