“మీరు మంత్రి కాబోతున్నారు.. రేపు ప్రమాణ స్వీకారానికి సిద్ధంకండి” ఈ ఒక్క పిలుపు కోసం కొన్ని వారాలుగా వైసీపీ ఎమ్మెల్యేలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడా సమయం రానే వచ్చింది. వారాల నుంచి రోజులు, రోజుల నుంచి గంటల్లోకి కౌంట్ డౌన్ మారింది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ రాబోతున్నాయి. మీరు మంత్రి అయ్యారనే తీపి వార్త చెవిన పడబోతోంది. మరి ఆ అదృష్టవంతులు ఎవరు? మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
రేపు ఉదయం 11 గంటల 31 నిమిషాల నుంచి అమరావతిలోని సెక్రటేరియట్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు అందాయి. ఒక ఆహ్వాన పత్రికపై ఒకరు మాత్రమే రావాలనే కండిషన్ పెట్టారు. కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితులను ఏఏ, ఏ1, ఏ2, బీ1, బీ2 కేటగిరీలుగా విభజించి పాసులు జారీ చేశారు. కార్యక్రమానికి అర్థ గంట ముందే వచ్చి కూర్చోవాలని కూడా సూచించారు.
ఓవైపు ఇలా ఏర్పాట్లు చురుగ్గా సాగుతుంటే, మరోవైపు ముఖ్యమంత్రి జగన్ నూతన మంత్రివర్గంపై రాత్రంతా కసరత్తు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం జాబితాకు తుది సవరణలు చేశారు. ఫినిషింగ్ టచ్ పూర్తయిన వెంటనే ఆ లిస్ట్ ను సీల్డ్ కవర్ లో గవర్నర్ కు పంపించారు. సామాజిక సమీకరణలు, అనుభవం, జిల్లా అవసరాల ప్రాతిపదికన కొత్త మంత్రుల్ని ఎంపిక చేశారు. మరికాసేపట్లో ఆ లిస్ట్ అధికారుల చేతికి వస్తుంది. ఆ వెంటనే నూతనంగా ఎంపికైన మంత్రులందరికీ ఫోన్ కాల్స్ వస్తాయి.
ఇంతకుముందు ప్రకటించినట్టు కాకుండా.. కొత్త కేబినెట్ లో పాత మంత్రులు కూడా కొంతమంది ఉండబోతున్నారు. వాళ్లను అలానే కొనసాగిస్తూ, అదనంగా మరో 17 మంది కొత్తవారికి మంత్రిమండలిలో చోటు కల్పించినట్టు తెలుస్తోంది. ఆదిమూలపు సురేష్, బొత్స, కొడాలి, బుగ్గన, పెద్దిరెడ్డి లాంటి పాత మంత్రులు కొనసాగే అవకాశం ఉండగా.. పేర్నినాని, చెవిరెడ్డి లాంటి వాళ్లకు మంత్రిపదవులు దక్కలేదనే విషయం ఆల్రెడీ బయటకొచ్చేసింది.
మొత్తమ్మీద రేపు ఎవరు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఆ ఒక్క ఫోన్ కాల్ వస్తే సస్పెన్స్ కు తెరపడినట్టే.