బొత్స పదవి పదిలం!

ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పదవి పదిలమేనా? ఆంధ్రలో కొత్త మంత్రి వర్గం ఈ సోమవారం ఏర్పాటు కాబోతోంది. ఈ క్రమంలో మంత్రుల అందరి రాజీనామాలు తీసుకున్నారు. కొత్తవారితో కొత్త మంత్రి వర్గం…

ఉత్తరాంధ్ర సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పదవి పదిలమేనా? ఆంధ్రలో కొత్త మంత్రి వర్గం ఈ సోమవారం ఏర్పాటు కాబోతోంది. ఈ క్రమంలో మంత్రుల అందరి రాజీనామాలు తీసుకున్నారు. కొత్తవారితో కొత్త మంత్రి వర్గం ఏర్పాటు అవుతుందని ముందుగా అనుకున్నా, కనీసం 10 మంది వరకు పాతముఖాలు వుంటాయని ఇప్పటికే వార్తలు వచ్చేసాయి.

ఇలా పదవిని నిలబెట్టుకునే పాత ముఖాల్లో బొత్స సత్యనారాయణ, పెదిరెడ్డి, కొడాలి నాని, బుగ్గన లాంటి వాళ్లు వుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన వారి సంగతి ఎలా వున్నా బొత్స అయితే మంత్రిగా వుంటారని ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా. అయితే ప్రస్తుతం వున్న శాఖ మారుతుందని, నీటి పారుదల శాఖను ఇచ్చే అవకాశం వుందని కూడా చెబుతున్నారు.

ఉత్తరాంధ్రలో సీనియర్ మంత్రి గా వున్నారు బొత్స. అటు శ్రీకాకుళం నుంచి కొత్తగా ధర్మాన ప్రసాదరావు, అనకాపల్లి ఙిల్లా నుంచి గుడివాడ అమరనాధ్ మంత్రులు అయ్యే చాన్స్ దాదాపుగా వుందని ఇప్పటికే పలు మాధ్యమాల్లో వెల్లడయింది. 

కొన్నాళ్ల క్రితం బొత్స మంత్రిగా వుండడం కన్నా, రాజ్య‌సభకు వెళ్లడానికి ఆసక్తిగా వున్నారని వార్తలు వచ్చాయి. కానీ మళ్లీ మనసు మార్చుకున్నారని, మంత్రిగానే కొనసాగబోతున్నారని తెలుస్తోంది.