ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కష్టాలున్నాయనేది వాస్తవం. పల్లెల్లో గరిష్టంగా 6 గంటలు.. పట్టణాల్లో గరిష్టంగా 3 గంటల పాటు కరెంట్ కట్ చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇప్పుడీ విషయాన్ని ప్రభుత్వం కూడా దాచిపెట్టడం లేదు. కరెంట్ కోతలు ఉన్నాయనే చెబుతోంది. ఇంతకీ రాష్ట్రంలో కరెంట్ కోతకు ప్రధాన కారణం ఏంటి?
ప్రధాన కారణాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కోతకు ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి బొగ్గు లభ్యత. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బొగ్గు, రోజువారీ కోటా కింద ప్రతి రోజు అందుతున్నప్పటికీ, నిల్వలు మాత్రం ఉండడం లేదు. దీని వల్ల విద్యుదుత్పత్తిని పెంచడం సాధ్యం కావడం లేదు.
ఇక రెండో కారణం, కరోనా తర్వాత వినియోగం పెరగడం. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పరిశ్రమలన్నీ ఒక్కసారిగా ఉపందుకున్నాయి. చాలా ఏళ్ల కిందట మూలనపడ్డ పరిశ్రమలు కూడా తెరుచుకున్నాయి. మాల్స్, రెస్టారెంట్లు ఓపెన్ అయ్యాయి. దీంతో వినియోగం అనుకున్న స్థాయికంటే విపరీతంగా పెరిగింది.
ఇక మూడో కారణం గృహ వినియోగం పెరగడం. గడిచిన రెండేళ్లో పోలిస్తే, ఈ ఏడాది రాష్ట్రంలో గృహవినియోగం కూడా పెరిగింది. ఈ వినియోగ స్థాయిల్ని అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడింది. ఓపెన్ మార్కెట్లో కూడా చాలినంత లభ్యత లేకపోవడంతో పవర్ కట్స్ అనివార్యమయ్యాయి.
ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా?
సంక్షేమ పథకాలకే డబ్బు మొత్తం కేటాయిస్తున్నారని, అందుకే కరెంట్ కొనడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. విద్యుత్ అవసరాల కోసం ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం.
అంతెందుకు.. గత నెల మార్చిలో కూడా 1551 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసింది ప్రభుత్వం. దీని కోసం 1258 కోట్ల రూపాయలు వెచ్చింది. ఈ నెల కూడా కొనడానికి సిద్ధంగా ఉంది కానీ ఓపెన్ మార్కెట్లో లభ్యత తగ్గింది.
దీంతో అడిగినంత విద్యుత్ ను ప్రైవేట్ సంస్థలు ఇవ్వలేకపోతున్నాయి. 50 మిలియన్ యూనిట్లు అడిగితే ప్రస్తుతం 30 మిలియన్ యూనిట్లు మాత్రం దొరుకుతోంది. దీంతో ఈ మేరకు పరిశ్రమలు, గృహాలపై కోతలు విధిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ అందుబాటులోకి వస్తే కొనుగోలు చేయడానికి ఈ క్షణం కూడా ప్రభుత్వం నిధులతో సిద్ధంగా ఉంది.
పూర్తిస్థాయిలో ఉత్పత్తి లేదా?
మరోవైపు రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి లేకపోవడం వల్లనే ఇలా జరిగిందంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. మరీ ముఖ్యంగా కీలకమైన జెన్ కోలో ఉత్పత్తి 50శాతానికి పడిపోయిందని, ప్రభుత్వం చేతకానితనం వల్ల ఇదంతా జరిగిందని ఇష్టమొచ్చినట్టు రాస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే.. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి వందశాతం జరుగుతోంది.
జెన్ కో, ఎన్టీపీసీ, సోలార్, పవన విద్యుత్, న్యూక్లియర్ విద్యుత్.. ఇలా అన్ని ప్లాంట్స్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. వీటి మొత్తం సామర్థ్యం 180 మిలియన్ యూనిట్లు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజుకు 240 మిలియిన్ యూనిట్లకు చేరుకుంది.
బహిరంగ మార్కెట్లో కూడా లభ్యత లేకపోవడంతో, కొరత ఏర్పడింది. ఈ స్థాయి విద్యుత్ వినియోగం జరుగుతుందని ప్రభుత్వం, అధికారులు అంచనా వేయలేకపోవడమే అసలు సమస్యకు కారణం.
కోతలు ఎప్పుడు తగ్గుతాయి?
మరి దీనికి పరిష్కారం ఏంటి? రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎప్పుడు తగ్గుతాయి? అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 10 రోజుల్లో రాష్ట్రంలో కరెంట్ కోతలుండవు. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి మూడొంతుల విద్యుత్ కేటాయించాల్సి వస్తోంది.
ఈ నెలాఖరుకు వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అప్పుడిక గృహావసరాలకు సరిపడ కరెంట్ అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో, పొరుగు రాష్ట్రాల్లో కూడా విద్యుత్ వినియోగం తగ్గి, ఏపీకి కొనుగోలు చేయడానికి మరింత కరెంట్ అందుబాటులోకి వస్తుంది.
కాబట్టి కనీసం మరో 2 వారాల పాటు విద్యుత్ కోతలు తప్పవు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల నుంచి ఏపీలో గృహావసరాలకు 24 గంటలు కరెంట్ ఉంటుంది. ఎండలు మండిపోయే మే, జూన్ నెలల్లో ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండవు.