ఒక్కో కథ ఒక దగ్గరే సెటిల్ అవుతుంది. ఒక్కో కథ చాలా చోట్ల తిరుగుతుంది. ఎవరి అదృష్టమో, దురదృష్టమో ఆ కథ సెటిల్ కావడం జరుగుతుంది. గని సినిమా కథ ముందుగా మైత్రీ మూవీస్ దగ్గరకు వెళ్లింది.
హీరో వరుణ్ తేజ్ స్వయంగా ఆ కథను వినమని మైత్రీ మూవీస్ కు రికమెండ్ చేసారట. కానీ అనుభవం బాగానే పండించుకున్న మైత్రీ అధినేతలు దాన్ని ఓకె చేయలేదట. దాంతో ఆ సబ్జెక్ట్ ను ప్రేమగా తయారు చేయించుకున్న వరుణ్ తేజ్ కొత్త నిర్మాత సిద్దుకు అప్పగించారు. అందులో భాగస్వామిగా అల్లు బాబి వచ్చి చేరారు.
మామూలుగా అయితే గని సినిమా నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టకపోను. కానీ రెండు విడతల కరోనా వచ్చి ఖర్చును అంతకు అంతా పెంచేసింది. అవసరం వున్నా లేకపోయినా భారీ సెట్ లు వేయడం, వేసిన సెట్ లు తీసేయాల్సి రావడం, మళ్లీ వేయడం, వరుణ్ మేకోవర్, జిమ్ ఖర్చులు, బాక్సింగ్ ట్రయినింగ్ ఇలా అన్నీ కలిసి ఖర్చులను పెంచేసాయి.
పాతిక కోట్ల మేరకు నాన్ థియేటర్ రూపంలో వచ్చింది. కానీ కరోనా కారణంగా బడ్జెట్, వడ్డీలు అన్నీ కలిసి 48 కోట్లకు చేరిపోయాయి. దాంతో థియేటర్ మీద భారం పాతిక కోట్ల వరకు వుండిపోయింది. అక్కడే అంచనాలు దెబ్బతినేసాయి.
సినిమా మేకింగ్ విషయంలో దర్శకుడు స్టామినా బాగానే వర్కవుట్ అయింది కానీ, కథ దగ్గరే కాస్త గట్టి కసరత్తు చేసి వుండాల్సింది. హీరో మేకోవర్ కోసం చేసినట్లుగా.