Samajavaragamana Review: మూవీ రివ్యూ: సామజవరగమన

చిత్రం: సామజవరగమన రేటింగ్: 3/5 తారాగణం: శ్రీవిష్ణు, రెబ్బ మోనిక జాన్, నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, దేవి ప్రసాద్, ప్రమోదిని, జెమిని సురేష్, రాజీవ్ కనకాల, ప్రియ, రఘుబాబు తదితరులు సంగీతం:…

చిత్రం: సామజవరగమన
రేటింగ్: 3/5
తారాగణం:
శ్రీవిష్ణు, రెబ్బ మోనిక జాన్, నరేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగర్, దేవి ప్రసాద్, ప్రమోదిని, జెమిని సురేష్, రాజీవ్ కనకాల, ప్రియ, రఘుబాబు తదితరులు
సంగీతం: గోపి సుందర్
కెమెరా: రాం రెడ్డి
ఎడిటర్: చోట కె ప్రసాద్
నిర్మాతలు: రాజేష్ దండ
దర్శకత్వం: రాం అబ్బరాజు
విడుదల: 29 జూన్ 2023

శ్రీవిష్ణు చాలా టాలెంట్ ఉన్న నటుడు. సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడకపోయినా, ట్రాక్ రికార్డ్ బలంగా లేకపోయినా అతనికి వరుస అవకాశాలొస్తున్నాయంటే అతని కామెడీ టైమింగ్, టాలెంటే కారణం. “సామజవరగమన” ట్రైలర్ చూస్తే సగటు రాం-కాం చిత్రంలా అనిపిస్తుంది. కొత్త కాన్సెప్ట్ ఏదో ఉందన్న సూచన ఉండదు. పైగా పాటలు అస్సలు హత్తుకోక మ్యూజికల్ బజ్ కూడా రాలేదు. అయినప్పటికి శ్రీవిష్ణు మీద నమ్మకంతో సినిమాకెళ్తే ఎలా ఉందో చెప్పుకుందాం. 

కథగా చూసుకుంటే చాలా వెరైటీగా ఉంటుంది. బాలు (శ్రీవిష్ణు) తండ్రి (నరేష్) దాదాపు 20 ఏళ్లుగా డిగ్రీ పరీక్షలు పాసవాడానికి విశ్వప్రయత్నం చేస్తుంటాడు. అది ఎప్పటికీ తెవలదు. ఈ గోల దేనికంటే, బాలు తాత తన ఆస్తిని డిగ్రీ పాసైతేనే కొడుకుకి అందేలా వీలునామా రాసి పోతాడు. అది వందల కోట్ల ఆస్తి. కనుక ఆస్తికోసమైనా తండ్రిని చదివించి డిగ్రీ పాస్ చేయించుకోవాల్సిన బాధ్యత, అవసరం బాలుది. 

ఇదిలా ఉంటే సరయు (మౌనిక) కూడా స‌ప్లీలు రాసుకునే బిలో యావరేజ్ స్టూడెంట్. ఆమె బాలు ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా చేరుతుంది. బాలు, సరయు ప్రేమలో పడతారు. కానీ వాళ్ల పెళ్లికి ఒకానొక కారణం వల్ల వారి వరుసలు అడ్డొస్తాయి. ఇది ఇంట‌ర్వల్ ట్విస్ట్. అక్కడి నుంచి కథ ఎలా నడుస్తుందన్నది తెర మీద చూడాలి. 

కథ ఎలా రాసుకున్నా, కథనం, సంభాషణ‌లో బలం లేకపోతే చిత్రం నిలబడదు. ఈ విషయాన్ని పూర్తిగా గ్రహించిన రచయిత, దర్శ‌కుడు కథన, సంభాషణ విభాగాల్ని చాలా జాగ్రత్తగా చెక్కారు. ఆద్యంతం నవ్వించేలా రాసుకున్నారు. నరేష్, శ్రీవిష్ణు ఎలాగూ కామెడీ టైమింగ్ లో నిష్ణాతులు కాబట్టి సన్నివేశాల్ని పండించేసారు. 

తండ్రి పరీక్షకెళ్లడం, కొడుకు తండ్రికి ట్యూషన్ పెట్టించడం, కాపీ కొట్టైనా పాసయ్యేందుకు ఏర్పాట్లు చేయడం…వంటివన్నీ ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. హీరో-హీరోయిన్స్ మధ్యలో పెళ్లి చేసుకోవడానికి అడ్డుపడే రిలేషన్ కూడా నవ్విస్తుంది. అలాగే కులశేఖర్ పేరుతో సెకండాఫులో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర కూడా సరదాగా ఉంది. 

అక్కడక్కడా బెటర్మెంట్స్ చేయొచ్చని అనిపించినా ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ వినోదాత్మక చిత్రం. ఇలాంటి సినిమా ఏ సెలవల్లోనో, పండగ సీజన్లోనో వచ్చుంటే బాక్సాఫీస్ ఫలితం చాలా ఘనంగా ఉండేది. 

ఇందులో చెప్పుకోదగ్గ మంచి అంశాలు- నరేష్, శ్రీవిష్ణుల నటన; ప్రధమార్ధం, సంభాషణలు, ఇంటర్వల్ ట్విస్ట్. ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేదని అనిపించే అంశం క్లైమాక్స్ భాగం. 

పాటలు మాత్రం చాలా బోరింగ్ గా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క పాట కూడా క్యాచీగా లేదు. అయినా ఇలాంటి కామెడీ చిత్రానికి పాటలు కథనంలో అడ్డుపడ్డాయి తప్ప పాజిటివ్ గా ఉపయోగపడలేదు. టెక్నికల్ గా ఎడిటింగ్ బాగుంది. 2 గంటల 20 నిమిషాల్లో సినిమా ముగిసింది. కెమెరా వర్క్ తదితరాలు ఎలా ఉండాలో అలా ఉన్నాయి. 

మధ్యతరగతి యువకుడి పాత్రలో శ్రీవిష్ణు మెప్పించాడు. తన సొంత డబ్బింగ్ కూడా రకరకాల వేరియేషన్స్ లోనూ, మాడ్యులేషన్ లోనూ చెప్పుకుని అలరించాడు. 

నరేష్ పర్ఫామెన్స్ బాగుంది. అలాగే శ్రీవిష్ణు చెల్లెలుగా చేసిన నటి తెలంగాణా యాసలో డైలాగ్స్ చెబుతుంటుంది. అన్నయ్యది గోదావరి యాసైతే, చెల్లిది తెలంగాణా యాస. అదొక కాంట్రాస్ట్. 

రఘుబాబు ట్రాక్ నవ్విస్తే, వెన్నెల కిషోర్ ట్రాక్ ఇంకా నవ్వించొచ్చు అనిపిస్తుంది. 

కుటుంబసమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఇది ఆ కోవకు చెందిన చిత్రం. ఏ వర్గం ప్రేక్షకులకైనా పెద్దగా కంప్లైంట్స్ లేని సినిమాగా అనిపించవచ్చు. ఈ చిత్రానికి “సామజవరగమన” అనే టైల్ ఎందుకో జస్టిఫికేషన్ లేదు. అయినా సరే నవ్వుకోవడానికి బాగుంది కాబట్టి అదేమంత పట్టించుకోవాల్సిన అంశం కాదు.  

బాటం లైన్: హాస్యవరగమన