అప్పుడెప్పుడో ఏడేళ్ల కిందట తెలుగులో సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ స్ట్రయిట్ సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు టాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమా చేయబోతోంది త్రిష. అది కూడా చిరంజీవి సరసన.
త్వరలోనే తన కొత్త సినిమా ఎనౌన్స్ చేయబోతున్నారు చిరంజీవి. కల్యాణ్ కృష్ణ డైరక్షన్ లో ఆ సినిమా ఉంటుంది. ఇందులో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిషను అనుకున్నారు. ఆమె కూడా దాదాపు ఓకే చెప్పింది.
గతంలో చిరంజీవి-త్రిష కలిసి స్టాలిన్ అనే సినిమా చేశారు. దాదాపు 17 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇలా చిరు-త్రిష కలవడం విశేషం. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర సరసన త్రిష హీరోయిన్ గా నటించనుంది.
2 దశాబ్దాలుగా కెరీర్ కొనసాగిస్తోంది త్రిష. మధ్యలో కాస్త ఫేడ్ అవుట్ అయినప్పటికీ, ఈమధ్య మళ్లీ పుంజుకుంది. తమిళ్ లో పొన్నియన్ సెల్వన్ రూపంలో హిట్ కొట్టింది. తాజాగా విజయ్ సరసన నటిస్తోంది. ఇలా కోలీవుడ్ లో కెరీర్ ఊపందుకున్న టైమ్ లో, టాలీవుడ్ లో కూడా చిరంజీవి సరసన నటించే అవకాశం అందుకుంది. 20 ఏళ్లకు పైగా కెరీర్ కొనసాగిస్తున్న అతికొద్ది మంది హీరోయిన్లలో త్రిష ఒకరు.