తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం రాజకీయం రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. గత ఏడాది దివంగతుడైన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి చంద్రబాబునాయుడు రిక్తహస్తం చూపించబోతున్నారా? నియోజకవర్గం రాజకీయంలో కొత్త ట్విస్టులు రాబోతున్నాయా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడును చంద్రబాబు తెలుగుదేశంలో చేర్చుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా.. ఎమ్మెల్యే టికెట్ కూడా ఎస్సీవీకే దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తి టికెట్ ఇస్తే గనుక.. అటు వెంకటగిరి, ఇటు సత్యవేడు నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతను కూడా భుజాన మోస్తానని ఎస్సీవీ నాయుడు చంద్రబాబుకు హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే బొజ్జల కుటుంబాన్ని కాదని, శ్రీకాళహస్తిలో మరొకరికి టికెట్ ఇవ్వగల ధైర్యం చంద్రబాబుకు ఉందా? అనేది పలువురి సందేహం.
శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చాలాసార్లు తెలుగుదేశం తరఫున గెలిచారు. మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలకు పూర్వమే విపరీతమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆ ఎన్నికల్లో కొడుకు బొజ్జల సుధీర్ తెదేపా తరఫున బరిలోకి దిగి.. బియ్యపు మధుసూదన రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే, సుదీర్ఘకాలం శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పనిచేసిన గోపాలకృష్ణారెడ్డి గత ఏడాది అనారోగ్యంతో మరణించారు.
బొజ్జల పెద్దకర్మ నాడే.. ఆయన సోదరుడు, ఆయన పరోక్షంలో నియోజకవర్గంలో పార్టీ రాజకీయాన్నంతా చక్కబెడుతూ ఉండే హరనాధరెడ్డి కూడా మరణించారు. ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు నాయకులు రోజుల వ్యవధిలోనే కన్నుమూశారు.
గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతితో పాటు.. నాన్న, చిన్నాన్న ఇద్దరూ చనిపోయిన నేపథ్యంలో నియోజకవర్గంలో సానుభూతి ఓటు ఈసారి బాగా వర్కవుట్ అవుతుందనే ఆశతో సుధీర్ రెడ్డి తనకు టికెట్ గ్యారంటీ అని అనుకుంటున్నారు. నియోజకవర్గంలో ఆయన ఓట్లు అభ్యర్థిస్తూ గ్రామాలు తిరగడం కూడా ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో ఠికానా లేక, అక్కడ తాను కోరిన అవకాశాలు ఇవ్వడం లేదని అలిగిన ఎస్సీవీ నాయుడు తెదేపాలో చేరడానికి పూనుకున్నారు.
బొజ్జల సుధీర్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో గతంలో వాయిదా పడింది. ఇప్పుడు బొజ్జలను బుజ్జగించారో లేదో తెలియదుగానీ.. ఎస్సీవీ చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఆయనకే టికెట్ ఇస్తే.. బొజ్జల ఫ్యామిలీ నుంచి బాబుకు ఇబ్బందే అనే ప్రచారం ఉంది.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యవహారంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డిది అప్పట్లో చాలా కీలకపాత్ర. వైస్రాయి హోటల్ వారి బంధువులదే. అప్పటి వెన్నుపోటు గుట్టుమట్టులన్నీ బొజ్జల కుటుంబం చేతుల్లో ఉన్నాయని, చంద్రబాబు సుధీర్ కు టికెట్ ఇవ్వకపోతే వారు చంద్రబాబు పరువు తీసే ప్రమాదం ఉన్నదని పలువురు అనుమానిస్తున్నారు. మరి చంద్రబాబునాయుడు ఎలాంటి ఎత్తుగడ వేస్తారో వేచిచూడాలి.