రాను రాను సినిమాల మీద ఫ్యాన్స్ చేసే సోషల్ మీడియా వత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాల అప్ డేట్ ల కోసం ఫ్యాన్స్ నుంచి వస్తున్న వత్తిడి మామూలుగా వుండడం లేదు. వత్తిడి వుండడం వేరు..నిర్మాతలను పట్టుకుని నానా తిట్లు తిట్టడం వేరు. అప్ డేట్ లు ఇచ్చే వరకు నిర్మాతలకు తిట్లు, ఇచ్చిన కంటెంట్ బాగాలేకపోతే దర్శకులకు తిట్లు అన్నది కామన్ అయిపోయింది. ఇదంతా ఫ్యాన్స్ నుంచి వస్తున్న వ్యవహారం.
నిర్మాతల బాధ ఫ్యాన్స్ కు పట్టదు. హీరో డబ్బింగ్ ఎప్పుడు చెబుతారో తెలియదు. అలాంటి టైమ్ లో నిర్మాతలు తొందరపడి అనౌన్స్ మెంట్ ఎలా ఇస్తారు? తీరా చేసిన కంటెంట్ హీరోకి నచ్చుతుందో లేదో తెలియదు. ఆయన చూడాలి. ఓకె అనాలి. అలా అనకపోతే, మళ్లీ మరో కంటెంట్ ప్రిపేర్ చేయాలి. తొందరపడి అనౌన్స్ చేస్తే, తనకు చెప్పకుండా చేసారని హీరో అంటే ఏమిటి పరిస్థితి.
ఓ టీజర్ లేదా ట్రయిలర్ వదలాలి అంటే దాని వెనుక ఎన్ని మీటింగ్ లు వుంటాయో, ఎన్ని డిస్కషన్లు వుంటాయో. సమయానికి మ్యూజిక్ డైరక్టర్ వర్క్ చేసి ఇవ్వాలి. అది ఫలానా టైమ్ కు పక్కా అనే గ్యారంటీ వుండదు. ఇలాంటి సమయంలో అనౌన్స్ మెంట్ ఎలా ఇస్తారు.
అప్ డేట్.. అప్ డేట్ అంటారు. కానీ నిర్మాతలు ఇవ్వాలంటే హీరో నుంచి కూడా కోపరేషన్ వుండాలి. హీరోకి చెప్పాలి. డిజైన్ చూపించాలి. ఇది ఒక హీరో అని కాదు. ఏ పెద్ద హీరో అయినా ఇదే పద్దతి. హీరోకి చెప్పకుండా, అనుమతి లేకుండా, ఒకె అనకుండా ఏ బ్యానర్ ఏదీ చేయలేదు. అలా అని ఇలా అనుకుంటే అలా వెళ్లి హీరో అనుమతి అడిగేసే పరిస్థితి వుండదు. దానికి ఓ సమయం సందర్భం వుంటుంది.
కానీ ఫ్యాన్స్ ఇవేమీ పట్టవు. అప్ డేట్..అప్ డేట్..అప్ డేట్. దీని వల్ల నిర్మాతలు భయంకరమైన వత్తిడికి గురవుతున్నారు. కొందరు నిర్మాతలు ట్విట్టర్ లో తమకు తిట్లు పడకుండా ఫ్యాన్స్ హ్యాండిల్స్ లో కీలకమైన వారిని చేరదీసి, వాళ్లకు అప్పుడప్పుడు సైలంట్ అప్ డేట్ లు ఇస్తూ, తమకు అనుకూలంగా ట్వీట్ లు వేయించుకుని, నెగిటివ్ ట్వీట్ ల నుంచి కాపాడుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వ్యూహాలు పన్నని వారు తిట్టలు తింటూ వుంటారు.
ఇక యాంటీ ఫ్యాన్స్ వ్యవహారం మరీనూ. సినిమా ఏమాత్రం కాస్త తేడాగా వున్నా, సినిమా చంపేసే వరకు సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ నిద్రపోరు. రకరకాల ఫేక్ వార్తలు, ఫేక్ వీడియోలు ట్వీట్టర్ లో పరుచుకుంటాయి. ఇక ఇటు ఫ్యాన్స్ అటు ఫ్యాన్స్ బూతుల దండకాలు మామూలే. కలెక్షన్లు వున్నాయని..లేవని ఇలా నానా రకాల ప్రచారం.
నిజానికి ట్విట్టర్, లేదా సోషల్ మీడియా అనేది లేకుండా వుంటే ఆదిపురుష్ అనే సినిమా మరి కొన్ని కోట్లు వసూలు చేసి వుండేది అన్నది పక్కా వాస్తవం. ఇక్కడ సినిమా బాగుందా లేదా అన్నది కాదు పాయింట్. జనాలకు సినిమాకు మధ్య అయితే పాజిటివ్ లేదా నెగిటివ్ వారథిగా సోషల్ మీడియా మారిపోయిందన్నదే పాయింట్.