శ్రీవిష్ణు కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు పేరు సామజవరగమన. ఈ సినిమాకు, టైటిల్ కు ఏంటి సంబంధం అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈ టైటిల్ పెట్టడం వెనక ఆసక్తికర విశేషాన్ని మాత్రం బయటపెట్టాడు శ్రీవిష్ణు. సంస్కృతం టచ్ కోసం ఈ టైటిల్ పెట్టామనేది ఈ హీరో వెర్షన్.
“బ్రోచేవారెవరురా, రాజరాజచోర, అర్జున ఫల్గుణ.. ఇలా నా సినిమాల్లో కొంచెం సంస్కృతం టచ్ ఉంటుంది. అయితే తొలిసారి పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్నాను. అందరికీ తెలిసిన టైటిల్ అయితే బాగుంటుందని అనుకున్నాం. 'సామజవరగమన' అయితే ఎలా ఉంటుందని అన్నప్పుడు నిర్మాత కి చాలా నచ్చింది. 'సామజవరగమన' టైటిల్ శంకరాభరణం, టాప్ హీరో, అల వైకుంఠపురం సినిమాల్లోని పాటలతో బాగా పాపులర్ అయింది. పైగా దీనికి పురాణాలతో కనెక్షన్ కూడా ఉంది. ఇంద్రుడు దగ్గరున్న ఐరావతం నడకని పోలుస్తూ సామజవరగమన అనే వర్ణన చేశారు. శ్రీరాముడు కూడా అంతే సొగసుగా నడుస్తాడని వర్ణన ఉంది”
ఇలా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్టు వెల్లడించాడు శ్రీవిష్ణు. సినిమాలో తాము చెప్పిన పాయింట్ కు, టైటిల్ కు ఎగ్జాట్ గా కనెక్షన్ లేనప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్ కు పడుతుందనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టినట్టు తెలిపాడు.
కంటెంట్ పై నమ్మకంతో 2 రోజుల ముందే ఈ మూవీ ప్రీమియర్స్ వేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నాడు శ్రీవిష్ణు. హాస్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను అనీల్ సుంకర సమర్పిస్తున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకుడు.