వీకెండ్ రిలీజ్.. ఈవారం 6 సినిమాలు

ఈసారి లాంగ్ వీకెండ్ కలిసొస్తోంది. అందుకే కాస్త బజ్ తో వస్తున్న 2 సినిమాలు, గురువారమే రిలీజ్ అవుతున్నాయి. మిగతా సినిమాలన్నీ శుక్రవారం రాబోతున్నాయి. అలా ఈ వారాంతం 6 సినిమాలు మార్కెట్లోకి వస్తున్నాయి.…

ఈసారి లాంగ్ వీకెండ్ కలిసొస్తోంది. అందుకే కాస్త బజ్ తో వస్తున్న 2 సినిమాలు, గురువారమే రిలీజ్ అవుతున్నాయి. మిగతా సినిమాలన్నీ శుక్రవారం రాబోతున్నాయి. అలా ఈ వారాంతం 6 సినిమాలు మార్కెట్లోకి వస్తున్నాయి.

రేపు రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఒకటి స్పై. నిఖిల్ హీరోగా నటించిన తొలి గూఢచారి సినిమా ఇది. పైగా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. ప్రమోషన్ కు పెద్దగా టైమ్ లేక, హడావుడిగా ప్రచారం చేసినప్పటికీ.. ట్రయిలర్, టీజర్ తో మంచి క్రేజ్ వచ్చింది. ఎడిటర్ గ్యారీ ఈ సినిమాను డైరక్ట్ చేశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, అతడి మరణానికి సంబంధించిన అంశాల్ని ఈ సినిమాలో టచ్ చేశారు.

స్పై సినిమాకు పోటీగా వస్తోంది సామజవరగమన. స్పై సినిమాలా కాకుండా, దీనికి పక్కాగా ప్రచారం నిర్వహించారు. ఇంకా చెప్పాలంటే, ప్రమోషన్స్ విషయంలో స్పై కంటే శ్రీవిష్ణు సినిమాదే పైచేయి. దీనికితోడు విడుదలకు ముందే ప్రీమియర్స్ వేసేశారు. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, ట్రయిలర్ సూపర్ సక్సెస్ అవ్వడం ఈ సినిమాకు కలిసొచ్చిన అంశాలు.

ఈ రెండు సినిమాల తర్వాత, 30వ తేదీకి ఒకేసారి 4 సినిమాలు క్యూ కట్టాయి. లవ్ యూ రామ్, గండ, మాయా పేటిక సినిమాలతో పాటు పవన్ కల్యాణ్ నటించిన పాత సినిమా తొలిప్రేమ రీ-రిలీజ్ అవుతోంది. దశరథ్ కథ అందించి, నిర్మించిన సినిమా లవ్ యు రామ్. రోహిత్ బెహల్, అపర్ణ జనార్థనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేమ-నమ్మకం అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. 2 పాటలు హిట్టవ్వడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

ఈ సినిమాల రాకతో ఈ వీకెండ్ ఆదిపురుష్ సినిమా భారీగా థియేటర్లు కోల్పోనుంది. శ్రీవిష్ణు, నిఖిల్ సినిమాలు క్లిక్ అవుతాయనే అంచనాలున్నాయి.