టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ప్రాధాన్యతలు మారిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఆందోళన చూస్తే …ఆయనపై జాలి కలగక మానదు. చంద్రబాబుది 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం. అందులో 14 ఏళ్ల పరిపాలనానుభవం.
ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పానని పదేపదే ప్రగల్భాలు పలికిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీద అరుపులు అరుస్తున్నారు. ఎన్నికలంటే విక్టరీ సంకేతాన్ని చూపుతూ గాంభీర్యాన్ని ప్రదర్శించే చంద్రబాబు …. ఇప్పుడు అలాంటి వాటి జోలికి అసలు వెళ్లడం లేవు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత కొన్ని రోజులుగా చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. అయితే ఇదంతా గెలుపు కోసమా? అంటే అదేమీ కాదు. గెలుపు కథ అటుంచితే …స్థానిక సంస్థలకు నామినేషన్లు వేయించడమే అతి పెద్ద విజయంగా చంద్రబాబు భావిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ ఏపీలో అధికారం చెలాయించిన టీడీపీ దుస్థితికి ఇది పరాకాష్టగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. వచ్చే నెల 9న మొదటి విడత జరగనున్న ఎన్నికలకు నిన్నటి నామినేషన్ల పర్వం ముగిసింది. తొలి దశలో 3,249 గ్రామపంచాయతీలు, 32,504 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 22,191, వార్డు స్థానాలకు 77,129 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయని సమాచారం.
ఇప్పటి వరకూ 93 పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయని అనధికారిక సమాచారం. ఈ పంచాయతీల్లో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. పంచాయతీల ఏకగ్రీవానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోంది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రధాన ప్రతిపక్షం గట్టి పట్టుదలతో ఉంది.
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అత్యధికంగా పంచాయతీలు ఏకగ్రీవం కావడం గమనార్హం. సీఎం జగన్ సొంత జిల్లాలో కేవలం 5 పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం కావడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
మొదటి నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఏకగ్రీవాలు అడ్డుకోవడంపై అభినందనలు తెలిపారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు, బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకుని పోరాడిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు అభినందనలు అని బాబు ప్రశంసల వర్షం కురిపించారు.
నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసే వరకు ఇదే స్ఫూర్తితో పోరాడాలి చంద్రబాబు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో గెలుపు నుంచి నామినేషన్ల వేయడమే పెద్ద విజయంగా సంతృప్తి చెందే స్థాయికి చంద్రబాబు దిగజారడం …. విజయమా? అపజయమా? అనేది టీడీపీ శ్రేణులే తేల్చుకోవాల్సి ఉంది.