మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కరోనా పరిస్థితులతో ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అనేక విమర్శలు వస్తున్న వేళ ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్ అన్ని రంగాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది.
కరోనా కష్టాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారాలనూ మోపడానికి వెనుకాడలేదు. లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అంటూ ఊదరగొట్టినా అంతా ఉత్తుత్తిదే అయ్యింది. ఇక పెట్రోల్, గ్యాస్ ధర పెంపు తీవ్ర విమర్శలకు దారి తీస్తూ ఉంది. ఇక గత ఏడాది కాలంలో చిరుద్యోగులు, పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకునే వారు చితికిపోయారు. అలాంటి వారిని ఆదుకునే ప్రయత్నాలు కూడా కేంద్రం ఎలాంటివీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో.. కేంద్ర బడ్జెట్ లో పన్నుల భారం ఏమైనా తగ్గుతుందా? లేక కరోనా కష్టాల పేరు చెప్పి ప్రజలపై మరింత భారాన్ని మోపడానికి ప్రభుత్వం మొగ్గుతుందా? అనేది చర్చగా సాగుతోంది.
పెట్రో చార్జీలపై సర్ చార్జీలు అతి స్వల్పంగా తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే మోడీ ప్రభుత్వం అలాంటి మొహమాటాలు పెట్టుకుంటుందా? అనేది సందేహమే. ఇక ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పు ఉండవచ్చంటున్నారు. అన్నింటికీ మించిన ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. కరోనా ట్యాక్స్ ను విధించే అవకాశాలున్నాయట. కరోనాతో కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడిన నేపథ్యంలో.. దాన్ని పూడ్చుకోవడానికి కరోనా పన్నులను విధించే అవకాశాలున్నాయంటున్నారు. అసలే ప్రజలే కరోనా పరిస్థితులతో బాధితులుగా మారిన పరిస్థితుల్లో కూడా కేంద్రం ఆ పేరుతోనే మళ్లీ పన్నులేస్తే.. సంక్షోభంలోనూ ప్రజలను పీల్చిపిప్పి చేయడమే అవుతుంది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి ఎలాంటి మొహమాటం లేదని వేరే చెప్పనక్కర్లేదు. బాదుడు ఎలా ఉంటుందో మరి కాసేపట్లో తెలియనుంది.