తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక త్వరలోనే జరగబోతోంది. ఇప్పుడు ప్రజల, పార్టీల చూపు దీని మీదనే ఉంది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సాగర్ ను కైవసం చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాయి. ఈ ఉప ఎన్నికను వచ్చే సాధారణ ఎన్నికలకు పెట్టుబడిగా భావిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికను, జిహెచ్‌ఎంసి ఎన్నికలను కూడా పార్టీలు అలాగే భావించాయి. వచ్చే ఎన్నికల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ అనుకుంటోంది. దాన్నుంచి అధికారాన్ని లాక్కోవాలని బీజేపీ, కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ లక్ష్యాన్ని సాధించి తీరుతామని బీజేపీ విశ్వాసంతో ఉంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే నాగార్జున సాగర్ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ లక్ష్యం ఘనంగా ఉన్నా అక్కడ కాషాయం పార్టీకి బలం లేదు. నోటిఫికేషన్ వచ్చేలోగా అభ్యర్థిని నిర్ణయించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ కు ఆల్రెడీ అభ్యర్థి ఖారారై పోయాడు. పార్టీలో మోస్ట్ సీనియర్, అనేకసార్లు నాగార్జున సాగర్ నుంచి జయేకతనం ఎగరేసిన పెద్దాయన జానారెడ్డి పోటీకి సిద్ధమయ్యాడు. చివరకు పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని కూడా వాయిదా వేయించిన ఘనుడు జానా.
ఆయనకు దీటైన అభ్యర్థి కోసం గాలిస్తున్నాయి టీఆర్‌ఎస్ అండ్ బీజేపీ. కాషాయం పార్టీ ముందుగా జానారెడ్డి కోసం ప్రయత్నించిందిగాని వీళ్ళ వలలో ఆయన పడలేదు.
కొన్నాళ్ల క్రితం వరకు తెలంగాణ రాజకీయాలు టీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉన్నాయి. కానీ కొన్ని నెలల నుంచి రాష్ర్టంలో రాజకీయాలు టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోయాయి. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరువాత టీఆర్‌ఎస్‌కు ధీటైన రాజకీయ ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగింది.
ఈ క్రమంలోనే త్వరలోనే జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తోంది. నాగార్జునసాగర్‌లో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా ప్రస్తుతం తెలంగాణలో తమకు అనుకూలంగా వీస్తున్న రాజకీయ పవనాలను వినియోగించుకుని నాగార్జునసాగర్‌లో ఆధిక్యత సాధించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో గతంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రదేశంలో ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బీజేపీ ముఖ్యనేతలను కలిశారని, నాగార్జున సాగర్ టికెట్ హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిన్నపరెడ్డి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ముఖ్య నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.
తమ సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్‌ను తిరిగి సొంతం చేసుకోవాలని టీఆర్‌ఎస్ పట్టుదలగా ఉంది. దుబ్బాక విషయంలో జరిగినట్టుగా సాగర్ విషయంలో జరగకూడదని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి బరిలోకి దిగడం ఖాయమైంది.
ఇక టీఆర్‌ఎస్ తరపున నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తారా లేక వేరే వారిని బరిలోకి దింపుతారా అన్నది తేలాల్సి ఉంది. దుబ్బాకలో మరణించిన ఎమ్మెల్యే భార్యేక అవకాశం ఇచ్చారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సాగర్‌లో దాన్నే రిపీట్ చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
నాగార్జునసాగర్ బరిలో నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వకపోతే.. బీసీలకు కాకుండా రెడ్డివర్గానికి చెందిన నేతలకు సీటు ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక ఇక్కడి అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని బీజేపీ భావిస్తోంది.
బీజేపీ తరపున నాగార్జునసాగర్ బరిలో నిలిచేందుకు నివేదితా రెడ్డి, అంజయ్య యాదవ్ పోటీ పడుతున్నారు. ఒకవేళ తేరా చిన్నపరెడ్డి నిజంగానే బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది.
నాగ్ మేడేపల్లి