నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీకి కొత్త సారథి వచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారన్న కారణంతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై వైసీపీ బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉదయగిరిలో వైసీపీకి కొత్త నాయకుడిని వెతుక్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి కుమార్తె ఆదాల రచనారెడ్డిని బరిలో నిలపాలని వైసీపీ అధిష్టానం ఆలోచించింది.
అయితే రాజకీయాలపై ఆమె అనాసక్తి కనబరచడంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చిన్న తమ్ముడు, ప్రముఖ కాంట్రాక్టర్ మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై వైసీపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఇటీవల ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తన బాబాయ్ రాజగోపాల్‌రెడ్డిని సీఎం వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్లారు. సీఎంతో చర్చించిన అనంతరం రాజగోపాల్‌రెడ్డిని ఉదయగిరి వైసీపీకి నూతన సారథిగా నియమించడం గమనార్హం.
మరోవైపు వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన మేకపాటి చంద్రశేఖరరెడ్డి టీడీపీ నేతల వెంట తిరుగుతున్నారు. ఇటీవల యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌ను మేకపాటి చంద్రశేఖరరెడ్డి కలుసుకున్నారు.
టీడీపీలో చేరుతున్నట్టు మేకపాటి ప్రకటించుకున్నారు. ఉదయగిరి టీడీపీ టికెట్‌ను మేకపాటి ఆశిస్తున్నారు. కానీ ఆయనకు ఇచ్చే పరిస్థితి లేదు. వివాహేతర సంబంధాలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలు మేకపాటికి చెడ్డపేరు తీసుకొచ్చాయి. వైసీపీ వద్దని విడిచి పెట్టిన మేకపాటిని తెచ్చుకుని, తాము మాత్రం ఏం చేసుకోవాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.