ఆంధ్రలో ఎన్నికలు ఇంకా చాలా దూరంలో వున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం కాలు దువ్వుతూ సమర శంఖాలు పూరించేస్తున్నాయి. లోకేష్ బాబు ఈ మధ్య ట్విట్టర్ లో తన భాషా పటిమ అంతా ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు సినిమాల్లోంచి బయటకు వచ్చి తనకు తోచినవో, లేదా ఎవరో చెప్పినవో ఏకరవు పెట్టి వెళ్తున్నారు.
చంద్రబాబు కేవలం పార్టీ మంత్రాంగాలు పరిమితమై వున్నారో ఏమో కానీ వీలయినపుడల్లా పత్రికల్లో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. వీరందరి టార్గెట్ అయిన వైఎస్ జగన్ ఇన్నాళ్లూ పెదవి విప్పకుండా కూర్చున్నారు. ఈ మధ్యనే అసెంబ్లీలో పంచ్ లు విసరడం ప్రారంభించారు. ఎన్నికల కాకున్నా, రాజకీయ హడావుడి మొదలైందని ఆయనకు క్లారిటీ వచ్చి వుంటుంది, అందుకే తొలిసారి బహిరంగ సభలో మాటల తూటాలు విసిరారు.
పవన్ కళ్యాణ్ తోలు తీస్తా అనొచ్చు. ఎవడ్రా ఆపేది అనొచ్చు. ఇంకా ఇంకా ఏమైనా అనొచ్చు. లోకేష్ బాబు ట్విట్టర్ లో తనకు తోచిన భాష వాడొచ్చు. నీ…నీ అబ్బ అనొచ్చు. ఇక తెలుగుదేశం సామాజిక మీడియా అయితే జగన్ రెడ్డి..జగన్ రెడ్డి అంటూ ఏకవచనం తమ చిత్తానికి వాడేయవచ్చు. ఇక అలాంటి సామాజిక మీడియా న్యూస్ యాంకర్లు అయితే రాజకీయ నాయకులను మించిపోయి చెలరేగిపోవచ్చు. దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ హూంకరించవచ్చు.
కానీ ఇంత మంది కలిసి టార్గెట్ చేస్తున్న జగన్ మాత్రం గట్టిగా మాట్లాడకూడదు. తన పార్టీ కార్యకర్తల వద్ద తన ఇజ్ఞత్ కాపాడుకోకూడదు. తను మాత్రం వీళ్లు అనే మాటలు పడుతూ చేతగాని దద్దమ్మలా వుండిపోవాలి. ఇదెక్కడి లాజిక్.
ఈ దుర్మార్గులు అంతా ఏకమైనా నా వెంట్రుక కూడా పీకలేరు అన్నారు జగన్. అది తప్పయిపోయింది తెలుగదేశం పార్టీకి, దాని పునాదుల్లో దాగిన సామాజిక మీడియాకు. హాత్తెరి, సిఎమ్ గా వుంటూ ఇలాంటి మాటలు మాట్లాడతారా? అంటూ తెగ బాధపడిపోతున్నారు.మరి వీళ్లు వాడే భాష ఏమిటి? అంటే వీళ్లు ఎలా అన్నా జగన్ అనేవాడు దులుపుకుంటూ పోవాలా? వీళ్లకు కౌంటర్ ఇవ్వకూడదా?
ప్రతిపక్షనేతలు, మీడియా తమ చిత్తానికి మాటల తూటాలు విసిరి జగన్ ను రెచ్చగొట్టొచ్చు. కానీ ఆయన మాత్రం నోరు విప్పకుండా అవి భరించాలి. ఇదెక్కడి లాజిక్?
జగన్ ఫుల్ క్లారిటీతో వున్నారు. అందుకే, తాను వచ్చిన తరువాత చేసిన పనులు మీకు నచ్చితే ఓటేయండి. లేదంటే వదిలెేయండి అని జనాలకు నేరుగా చెప్పుకున్నారు. ప్రభుత్వం నుంచి నెల నెలా డబ్బులు అందుకుంటున్న ఎవరికి మాత్రం జగన్ చేదు అవుతాడు? అదే ప్రతిపక్షాల బాధ. జనం ఆ డబ్బుల కోసం మళ్లీ ఎక్కడ జగన్ నే నెత్తిన పెట్టుకుంటారో అని. అలా అయితే తాము ఇక తట్టా బుట్టా సర్దేయాల్సి వస్తుందని.
జగన్ చేసిన ఒక్క బహిరంగ ప్రసంగానికే ఇంతలా గింజుకుంటున్నారు. ఇక పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్లి, వీళ్ల మీద విరుచుకుపడడం ప్రారంభిస్తే ఎలా వుంటుంది? ఆ ఊహే ఆందోళనకరంగా వుంది ప్రతిపక్ష నేతలకు. ఇక్కడ గమ్మత్తేమిటంటే ప్రతిపక్షాలు, సామాజిక మీడియా కలిసి వంద ఆరోపణలు చేస్తున్నాయి. ఇదంతా కుట్ర..నమ్మకండి అంటూ ఒక్క డైలాగుతో మొత్తం కొట్టి పడేస్తున్నారు జగన్. ఇప్పటికే దేశం సామాజిక మీడియాను జనం నమ్మడం మానేసారు. ఆ మీడియాలు అలాగే రాస్తాయని అర్థం అయిపోయింది జనాలకు. ఇప్పుడు జగన్ కూడా అదే చెబుతున్నారు.
నౌ జగన్ ఇన్ ఫుల్ అటాక్ మోడ్. అదే పెదబాబు, చినబాబు, కళ్యాణ్ బాబు ల్లాంటి వారికి కలవరంగా వుంది. వారి అనుకూల సామాజిక మీడియాకు కంపరంగా వుంది. కానీ ఏం చేయాలి. ఎవరి అస్త్రాలు వారివి. ఎవరి యుద్దం వారిది. జగన్ కూడా తన యుద్దం తాను చేయాలి. ఆ హక్కు అతగాడికి వుందికదా?