అన్నీ తానై ఆర్జీవీ తీసిన సినిమా డేంజరస్. తెలుగు వరకు వచ్చేసరికి దీనికి 'మా ఇష్టం' అనే టైటిల్ ఫిక్స్ చేశాడు వర్మ. తన సినిమాలకు ఎలా ప్రచారం చేయాలో రామ్ గోపాల్ వర్మకు బాగా తెలుసు. అయితే 'మా ఇష్టం' విషయంలో మాత్రం ఈ దర్శకుడు, మరిన్ని కొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.
లెస్బియన్ కంటెంట్ తో తెరకెక్కింది 'మా ఇష్టం' సినిమా. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరించరనే విషయం వర్మకు తెలుసు. ఇది పక్కా ఓటీటీ సినిమా అనే విషయం కూడా ఆయనకు తెలుసు. అయినప్పటికీ థియేట్రికల్ రిలీజ్ కోసం ప్రయత్నించారు వర్మ. సరిగ్గా ఇక్కడే ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.
మహిళా స్వలింగ సంపర్కుల సబ్జెక్ట్ తో తెరకెక్కిన 'మా ఇష్టం' సినిమాను ప్రసారం చేయమంటూ థియేటర్ల యాజమాన్యాలు రివర్స్ అయ్యారు. నట్టికుమార్ అనే నిర్మాత మరో అడుగు ముందుకేసి, అసలు ఈ సినిమాకు సెన్సార్ కూడా అవ్వలేదని ఆరోపించారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లను వర్మ మోసం చేశారని అన్నారు.
మొత్తమ్మీద నిన్న రిలీజ్ అవ్వాల్సిన 'మా ఇష్టం' సినిమా వాయిదా పడింది. ఈ మొత్తం వ్యవహరాన్ని చూస్తున్న నెటిజన్లు, తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి వర్మ, ఈ సరికొత్త ప్రచార ఎత్తుగడను ఎంచుకున్నాడని అంటున్నారు. తనే వివాదం రేపి, తనే దాన్ని ఎగదోసి, ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేస్తే డబ్బులొస్తాయని వర్మ ప్లాన్ చేసినట్టున్నాడంటూ కామెంట్స్ పడుతున్నాయి.
ఏమో నెటిజన్ల అభిప్రాయమే కరెక్ట్ కావొచ్చు. తన సినిమా ప్రచారం కోసం వర్మ ఎంతదాకైనా వెళ్తాడు. ఏమైనా చేస్తాడు. ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టు వర్మ ప్రచారం కూడా డేంజరస్ గా కనిపిస్తోంది. చూస్తుంటే.. నైనా గంగూలీ, అప్సర రాణి అందాలు ఓటీటీకే పరిమితమయ్యేలా ఉన్నాయి.