జ‌గ‌న్‌ అక్క‌డ అడుగు పెడితే వివాద‌మే!

కాలం, ప్రాంతం మ‌హిమ అంటే ఏమో అనుకుంటాం. కానీ కొన్ని సంద‌ర్భాల్లో న‌మ్మ‌క త‌ప్ప‌దు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆ గ‌డ్డ‌పై అడుగు పెడితే వివాద‌మే. క‌ర్నూలు నుంచి వేరు ప‌డి నంద్యాల జిల్లాగా…

కాలం, ప్రాంతం మ‌హిమ అంటే ఏమో అనుకుంటాం. కానీ కొన్ని సంద‌ర్భాల్లో న‌మ్మ‌క త‌ప్ప‌దు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆ గ‌డ్డ‌పై అడుగు పెడితే వివాద‌మే. క‌ర్నూలు నుంచి వేరు ప‌డి నంద్యాల జిల్లాగా అవ‌త‌రించిన ఆ గ‌డ్డ‌పై అడుగు పెడితే చాలు… జ‌గ‌న్‌లో ఏదో శ‌క్తి ఆవ‌హించిన‌ట్టు ఆవేశంతో ఊగిపోతారు. మాట‌ల తూటాలు పేలుతాయి. చివ‌రికి ఆయ‌న మాట‌లు తీవ్ర వివాదాస్ప‌దం కావ‌డం చర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

వ‌స‌తి దీవెన నిధుల పంపిణీకి నంద్యాల ఎస్పీజీ మైదానం వేదికైంది. ఈ మైదానంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియాపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘దేవుడి దయ, మీ (ప‌జ‌లు) అందరి చల్లని దీవెనలున్నంత వరకు వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు’ అని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా తన తలలో వెంట్రుకలను పట్టుకుని పీక‌లేర‌ని చూప‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి.

ఇదిలా వుండ‌గా ఇదే నంద్యాల‌, ఇదే ఎస్పీజీ మైదానంలో 2017, ఆగ‌స్టు 3న ఉప ఎన్నిక సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో నాటి ముఖ్య‌మంత్రి చంద్రబాబుపై జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇదే వూళ్లో అదే ఏడాది ఆగ‌స్టు 11న నిర్వ‌హించిన రోడ్‌షోలో కూడా జ‌గ‌న్ ప్ర‌సంగం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. నాడు ఏమ‌న్నారో తెలుసుకుందాం.  

2017 ఆగ‌స్టు 3న ఎస్పీజీ మైదానంలో జ‌గ‌న్ ప్ర‌సంగిస్తూ చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై కాల్చినా ఫ‌ర్వాలేదని అభ్యంత‌ర‌కర వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌ర్వాత మ‌రో 8 రోజుల‌కు ఆగ‌స్టు 11న రోడ్‌షోలో మాట్లాడుతూ చంద్ర‌బాబుకు క‌ళ్లు నెత్తికెక్కాయ‌ని, ఉరిశిక్ష వేసినా త‌ప్పులేదని విరుచుకుప‌డ్డారు. తాజాగా నంద్యాల‌లోనే త‌న వెంట్రుక‌లు పీక‌లేర‌ని జ‌గ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో నాటి వివాదం తెర‌పైకి వ‌చ్చింది. అంతా స్థ‌ల మ‌హిమ అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.