ఆమధ్య నాగశౌర్యకు సంబంధించిన ఓ వీడియో బాగా వైరల్ అయింది. “రోడ్డుపై గొడవ పడుతున్న జంటను శౌర్య ఆపాడు. వాళ్ల సమస్య తెలుసుకున్నాడు. అబ్బాయికి బుద్ధి చెప్పాడు.” ఇప్పటివరకు అంతా ఇలానే అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరే.
అప్పటి ఘటనపై నాగశౌర్య స్పందించాడు. అ ఘటనలో అబ్బాయిని తను కొట్టలేదని క్లారిటీ ఇచ్చిన శౌర్య.. అతడ్ని మందలిస్తుంటే, అమ్మాయి తనకు రివర్స్ లో షాక్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.
“ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే.. నేను ఓ పని మీద కారులో వెళ్తున్నాను. కూకట్ పల్లి రోడ్డు మీద ఓ అమ్మాయిని, ఓ అబ్బాయి కొడుతున్నాడు. అది చూసి నేను ఆగాను, ఎందుకు కొడుతున్నావని అడిగాను. ఆ టైమ్ లో అబ్బాయి కంటే ముందు ఆ అమ్మాయి రియాక్ట్ అయింది. నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొడతాడు లేదంటే చంపుతాడు, మధ్యలో ఎంటర్ అవ్వొద్దని నాతో అంది. అలాంటి అమ్మాయితో ఇంకేం మాట్లాడతాం. నిజానికి నేను పోలీస్ కంప్లయింట్ ఇద్దామనుకున్నాను, అమ్మాయి అలా మాట్లాడేసరికి షాక్ అయ్యాను.”
ఆ రోజు తనకు ఎదురైన అనుభవంలో కొట్టిన అబ్బాయిది తప్పులేదని, కొట్టించుకున్న అమ్మాయిదే వందశాతం తప్పని అభిప్రాయపడ్డాడు శౌర్య. “కొట్టే అబ్బాయిల్ని ప్రేమించొద్దు, పెళ్లి చేసుకోవద్దు. అది అమ్మాయిలకు, వాళ్ల కుటుంబాలకు మంచిది కాదు. ప్రేమగా ఉండేవాడ్ని పెళ్లి చేసుకోండి. కొట్టేవాడు, తిట్టేవాడితో ఉండొద్దు.” అంటూ అమ్మాయిలకు విజ్ఞప్తి చేశాడు నాగశౌర్య.
టీఆర్పీ కోసం, వ్యూస్ కోసం నాగశౌర్య ఆ రోజు అలా బిహేవ్ చేశాడంటూ వచ్చిన కథనాల్ని హీరో ఖండించాడు. తన మనసుకు బాధ అనిపించి, కారు దిగి రోడ్డుపైకొచ్చానని స్పష్టం చేశాడు.