ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రాలో మరోసారి పాదం మోపబోతున్నారు. కురుపాంలో ఆయన అమ్మ ఒడి నాలుగవ విడత నగదు విడుదల చేసే కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఈ నెల 28న జగన్ విశాఖ మీదుగా పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్నారు. జగన్ ఈ సందర్భంగా విశాఖలో కొంత సేపు గడుపుతారు. విశాఖలో సీఎం ట్రాన్సిట్ హాల్ట్ ఉండడంతో విశాఖ వైసీపీ లీడర్స్ అంతా అలెర్ట్ అవుతున్నారు.
సీఎంకి స్వాగతం పలకడమే కాకుండా ఆయనతో ఏమైనా చర్చించే అవకాశం ఉంటుందేమో అని ఎదురుచూస్తున్నారు. ఇటీవల విశాఖ ఏపీలోనే మారు మోగింది. విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ జరిగింది. దాంతో విశాఖలో భద్రత లేదని ప్రచారం కూడా విపక్షాలు మొదలెట్టాయి.
ఈ క్రమలో విశాఖ వస్తున్న జగన్ పార్టీ నేతలతో ఏమి మాట్లాడుతారు, అధికారులకు ఏమి సూచనలు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖలో సెప్టెంబర్‌లో మకాం జగన్ మారుస్తారు అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దాని మీద కూడా జగన్ క్లారిటీ ఇస్తారా అన్నది కూడా వైసీపీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
ఈసారి జగన్ ఉత్తరాంధ్రా టూర్ రాజకీయంగా కూడా కొంత వేడిని రగిల్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణం ఇది. జగన్ ఉత్తరాంధ్రా మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఉన్నారు. అందువల్ల మన్యం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు అని అంటున్నారు. జగన్ పర్యటన మాత్రం పొలిటికల్ గా అటెన్షన్ కి కారణం అవుతోంది.