ఆదిపురుష్ లో భజరంగీ పాత్రతో చెప్పించిన డైలాగ్స్ పై తీవ్ర వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పురాణాల్ని, దేవుళ్లను కించపరచడమే లక్ష్యంగా ఈ సినిమా తీశారని చాలామంది విరుచుకుపడ్డారు. దీంతో మేకర్స్ ఆ వివాదాస్పద డైలాగ్ ను మార్చేశారు. అయితే డైలాగ్ మార్చినా ఆదిపురుష్ ను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టులో ఈ సినిమాపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
రామాయణ ఇతిహాసం ఆధారంగా ఆదిపురుష్ సినిమాను తీసి, దేవతల ఔన్నత్యాన్ని తగ్గించి, భక్తుల మనోభావాలు కించపరిచారని, కాబట్టి ఆదిపురుష్ ప్రసారాల్ని వెంటనే నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు పిటిషనర్ మమతా రాణి. వాల్మీకి రాసిన రామాయణంలోని ప్రాధమిక సూత్రాలను, మూలకథను నాశనం చేస్తూ ఆదిపురుష్ సినిమా తీశారని పిటిషనర్ ఆరోపించారు.
ఈ చిత్రానికి సెన్సార్ ఎలా క్లియరెన్స్ ఇచ్చిందో చెప్పాలని తన పిటిషన్ లో డిమాండ్ చేశారు మమత. సామాన్య మానవుడు తన ఆధ్యాత్మిక చింతన కోసం పవిత్ర గ్రంధాలపై ఆధారపడతాడని, అలాంటి గ్రంధాల్ని వక్రీకరించకూడనే నిబంధన సినిమాటోగ్రాఫ్ చట్టంలో ఉందని, కాబట్టి ఆదిపురుష్ సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని ఆమె అత్యున్నత ధర్మాసనాన్ని కోరారు.
ఆదిపురుష్ సినిమాలో పాత్రలు మాట్లాడే భాష లో-క్లాస్ గా ఉందని, ఊళ్లల్లో గల్లీ బాయ్స్ మాట్లాడే భాషను దేవతలకు ఆపాదించారని ఆరోపించారు. రాముడు, సీత, హనుమంతుడి పాత్రల చిత్రీకరణ కూడా అసభ్యంగా ఉందని.. సినిమాటోగ్రాఫ్ చట్ట-1952లోని సెక్షన్-7కు విరుద్ధంగా ఇది ఉందని ఆరోపించారు.
ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ తరపున న్యాయవాదులు శైలేంద్ర మణిత్రిపాఠి, ఆకాష్ ఆవానా, రత్నేష్ శుక్లా వాదించారు.
ఇతర కోర్టుల్లో కూడా పెండింగ్..
మరోవైపు అలహాబాద్, ఢిల్లీ, రాజస్థాన్ హైకోర్టుల్లో కూడా ఆదిపురుష్ పై పిటిషన్లు ఉన్నాయి. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించగా, తాజాగా అలహాబాద్ హైకోర్టు, అభ్యంతరకర పద్ధతిలో పాత్రల్ని చిత్రీకరించినందుకు గాను ఆదిపురుష్ యూనిట్ పై మండిపడింది.
ఆదర్శవంతమైన రామాయణంలో అభ్యంతరకర డైలాగ్స్ పెట్టడాన్ని అలహాబాద్ హైకోర్టు ఖండించింది. అసలు సెన్సార్ బోర్డ్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిందా అని ప్రశ్నించిన హైకోర్టు.. వివాదాస్పద డైలాగ్స్ రాసిన మనోజ్ ముంతాషిర్ శుక్లాను కూడా ఈ కేసులో భాగస్వామిగా చేయాలని, వారం లోగా అతడు కోర్టుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దేశప్రజలకు బుర్రలేదని అనుకుంటున్నారా అంటూ ఆదిపురుష్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాని, హోం మంత్రికి లేఖలు…
ఈ సినిమాను నిషేధించాలంటూ ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రధాని, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాశాయి. వీటిలో ముఖ్యంగా ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా ఉంది. ఆదిపురుష్ లో ప్రతి సన్నివేశం, ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్ అభ్యంతరకరంగా ఉందని ఆరోపించింది అసోసియేషన్. తక్షణం సినిమా ప్రసారాల్ని నిలిపివేయాలని కోరుతూ కొన్నాళ్ల కిందట ప్రధాని మోదీకి లేఖ రాసింది. తాజాగా హోం మంత్రి అమిత్ షాకు కూడా లేఖ రాసింది.
మళ్లీ పడిపోయిన వసూళ్లు…
మరోవైపు ఆదిపురుష్ కలెక్షన్లు మళ్లీ డల్ అయ్యాయి. సోమవారం ఈ సినిమా దేశవ్యాప్తంగా పూర్తిగా పడిపోయింది. టికెట్ రేట్లు తగ్గించినప్పటికీ, ఎలాంటి ప్రభావం కనిపించలేదు. ఉత్తరాదిన ఈ సినిమాకు సోమవారం కేవలం కోటీ 70 లక్షల నెట్ వచ్చింది. ఆదిపురుష్ సినిమాకు ఒక రోజులో వచ్చిన అత్యల్ప వసూళ్లు ఇవే. ఈ సినిమా హిందీ వెర్షన్ కు కేవలం 8.06 ఆక్యుపెన్సీ కనిపించింది.