సై అంటే సై

‘‘కత్తులు దూయని.. కక్షలు పెరగని.. పగలే రగలని.. గ్రామస్వరాజ్యం.. గాంధీరాజ్యం’’.. రావాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు కలలు కంటోంది.  Advertisement ‘‘రంకెలు వేస్తా.. కత్తులు దూస్తా..దన్ను చూసుకుని.. వెన్నులో వణుకు పుట్టిస్తా’’ అంటూ చెలరేగిపోవడం…

‘కత్తులు దూయని.. కక్షలు పెరగని.. పగలే రగలని.. గ్రామస్వరాజ్యం.. గాంధీరాజ్యం’’.. రావాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు కలలు కంటోంది. 

‘‘రంకెలు వేస్తా.. కత్తులు దూస్తా..దన్ను చూసుకుని.. వెన్నులో వణుకు పుట్టిస్తా’’ అంటూ చెలరేగిపోవడం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ధోరణిగా కనిపిస్తోంది. 

ఎన్నికలు నిర్వహించడానికి వెరపు గానీ,  జంకు గానీ లేవని.. ప్రజారోగ్యం గురించిన ఆలోచన మినహా మరో అభ్యంతరం తమకు లేదని జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. కరోనా నేపథ్యంలో తలెత్తిన  ప్రత్యేక వాతావరణాన్ని విస్మరించి.. కోర్టుల్ని, చట్టాల్ని అడ్డు పెట్టుకుని చెలరేగుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార సరళి.. సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రంలో స్థానిక సమరాంగణంలో నెలకొన్ని ప్రత్యేక పరిస్థితులపై గ్రేటాంధ్ర విశ్లేషణాత్మక కథనం.

మహాత్ముడు ఈ రాజ్యంలో గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లాలని అభిలషించాడు. పల్లెల ప్రగతి దేశ ప్రగతి అని అనుకున్నాడు. గ్రామాలు స్వయం సమృద్ధమై ప్రకాశించాలని కోరుకున్నాడు. ఆ దిశగా ఇప్పటిదాకా ఎన్ని అడుగులు పడుతున్నాయి? ఎప్పటికీ అంతుతేలని ఈ ప్రశ్నను పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్తమాన రాజకీయాల్లో అభిలషించినది ఏమిటి? ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి చిన్న యూనిట్ గా పరిగణించదగినవి పంచాయతీలు.

ఆ పచ్చని పంచాయతీల్లో అగ్గి రగలకూడదని అనుకున్నారు. అందుకే పంచాయతీల్లోని ప్రజల మధ్య సయోధ్య, సుహృద్భావ వాతావరణం చెడిపోకుండా ఉండడానికి- ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలను జగన్మోహన్ రెడ్డి పెంచారు. భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. 

ఇలాంటి పనివల్ల ఏం ఉపద్రవం జరుగుతుంది? ఏం నష్టం జరుగుతుంది? అసలు ఇలాంటి ప్రోత్సాహకాల పర్యవసానం ఏమిటి? మహా అయితే పంచాయతీలకు లక్షలకు లక్షల రూపాయల డబ్బులొస్తాయి.

చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు.అంతకు మించి ఏమవుతుంది? కానీ కుట్రలతో  కూహకాలతో చెలరేగిపోయే దుర్మార్గుల కళ్లు ఇలాంటి ఏర్పాటు చూసి ఓర్చుకోలేకపోయాయి. ఇలాంటి మంచి ఏర్పాటు మీద కూడా ఎలా బురద చల్లాలా అని పన్నాగాలు పన్నాయి. 

రాజకీయ ప్రత్యర్థులు, నిత్యం ఓర్వలేని తనంతో.. జగన్ పాలన వలన తమకు అసలు భవిష్యత్తే లేకుండాపోయిందనే భయంతో.. విలవిల్లాడిపోతున్న వారు.. అలాంటి ప్రయత్నానికి తెగబడితే తప్పులేదు. కానీ.. బాధ్యతగల అధికారులు రాజ్యాంగ వ్యవస్థలు కూడా అదే తీరుతో వ్యవహరిస్తే ఎలా? అనేదే ప్రజల్లో సందేహంగా ఉంది. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకుంటాం అనడంలో అర్థ మేంటి? ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది.. ప్రజల్లో సుహృద్భావ వాతావరణం విలసిల్లే ఏకగ్రీవ ఎన్నికల్లో నిప్పులు పోయాలనే లక్ష్యమే అని తెలిసిపోతోంది.

చరిత్ర ఎరుగని ఎన్నికలు ఇవి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర ఎన్నడూ ఎరుగని ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో, వితండపు ఎన్నికలు ఎన్నడూ జరగలేదు. ఆ రకంగా చరిత్రలో మిగిలిపోయే పుటలను సొంతం చేసుకుని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పీఠం నుంచి దిగిపోనున్నారు.

ఇప్పుడు ఎంతో ఆత్రంగా, దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలాగా, దేశభద్రతకు అవశ్యమైన వ్యవహారం లాగా జరుగుతున్న ఎన్నికలు.. నిజానికి 2018లో జరగాల్సినవి అని తెలిస్తే చాలా మంది ముక్కున వేలేసుకోవచ్చు. 

అప్పట్లో ఎన్నికలు జరిపితే.. అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద ఉన్న ప్రతికూలత యావత్తూ బయటపడితే.. ఆ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ సర్వనాశనం అయిపోతుందనే చింత- ఇదే ఎన్నికల కమిషనర్ లో అప్పట్లో వేడి రగిల్చలేకపోయింది. తొందర పుట్టించలేకపోయింది. ఆయన మాయోపాయాలు చంద్రబాబుకోసమే ఆగాయి. ఆ పన్నాగాలేవీ ప్రజల విచక్షణ ముందు నిలవలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబునాయుడు పార్టీ మట్టిగొట్టుకుపోయింది. 

ఏమీ మిగల్లేదు. అయినా ఆయనలో ఆరాటం మాత్రం ఆగలేదు. ఎన్నికలు సజావుగా జరుగుతున్న సమయంలో కరోనా బూచి చూపి వాయిదా వేశారు. సదరు కరోనాకు అందరూ అప్రమత్తంగా ఉండి భరతవాక్యం పలకాల్సిన సమయంలో.. ఇలా లాకులు ఎత్తేసి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నారు. కోర్టు ద్వారా కొన్ని చట్టాల ద్వారా వెసులు బాటు వచ్చేసరికి.. తానే యావత్ రాష్ట్రానికి సర్వాధికారిని అయినట్టుగా, అంతకు మించి తానే సర్వాంతర్యామిని అయినట్టుగా  ఆయన చెలరేగిపోతున్నారు.

ఈ ఎన్నికల్లో పారదర్శకత ఉందా?

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండని.. స్వతంత్ర రాజ్యాంగబద్ధ వ్యవస్థగా ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం వెనుక చాలా సమున్నతమైన లక్ష్యం ఉంది. ఏ పార్టీలకు వ్యక్తులకు లోబడే, ఇష్టాయిష్టాలకు అనుకూలంగా వ్యవహరించేలా ఉండకూదనేదే ఆ లక్ష్యం. ఎన్నికలు అనేవి ఎవ్వరి ప్రభావమూ లేకుండా పారదర్శకంగా జరగాలనేది లక్ష్యం. కానీ.. ఆ విలువల్ని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తుంగలో తొక్కేశారు. ఒక రాజ్యాంగ వ్యవస్థలాగా కాకుండా.. ఒక పార్టీ ఏజెంటులాగా వ్యవహరిస్తున్నారని సామాన్య ప్రజలు ఎవరైనా అనుకుంటే.. అది అసంబద్ధం ఎలా అవుతుంది?

నిమ్మగడ్డ వ్యవహార సరళి పట్ల విసిగిపోయి.. ఆయనను ఇంటికి పంపడం కోసం ప్రత్యేకంగా జీవో తెచ్చి.. పదవీకాలాన్ని కుదించడం ప్రభుత్వం తరఫునుంచి దూకుడైన నిర్ణయం. అది అంతగా సమర్థనీయం కాదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి పంతంగా వ్యవహరించే తీరువల్ల.. అలా జరిగింది. దానికి తగ్గట్టుగానే.. సుప్రీం కోర్టు ద్వారా నిమ్మగడ్డ మళ్లీ కుర్చీ ఎక్కారు. 

చట్టబద్ధంగా ఆయన తిరిగి పదవిలోకి వచ్చిన తర్వాత.. వ్యక్తిగతమైన ఈగోలు, ఆవేశకావేషాలను పక్కన పెట్టి ఆయన హుందాగా వ్యవహరించి ఉంటే.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం ఇంకో రకంగా ఉండేది. కానీ.. ఆయన ప్రభుత్వాన్ని ప్రత్యర్థిలాగా భావిస్తూ ప్రతి నిర్ణయంతోనూ చెలరేగిపోతున్నారు.

వేక్సినేషన్ దశలో బలవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఉపక్రమించడం.. ప్రజల, ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టడమే అనే అభిప్రాయాలు ఎంతగా వ్యక్తమౌతున్నా పట్టించుకోనేలేదు. అందుకే.. ఆయన తీరు పారదర్శకంగా కాకుండా, పార్టీల భావజాలాలకు అనుగుణంగా నడుస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. 

వైఎస్సార్సీపీ లక్ష్యం ఏమిటి?

రాష్ట్రంలో మొత్తం 11 వేల పంచాయితీలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగే వాతావరణం, ప్రస్తుతం అసెంబ్లీలో తమకు ఉన్న బలాబలాల గురించిన అంచనాతో.. కనీసం 7500 పైగా స్థానాలు వస్తాయనే నమ్మకం ఆ పార్టీలో ఉంది. అందులో సుమారు 2000 కు మించి ఏకగ్రీవాలు ఉంటాయనే నమ్మకం కూడా వారికి ఉంది. 

పార్టీ విశ్వసిస్తున్న దాన్ని బట్టి.. గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా వారికి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. అదే జరిగితే గనుక.. అమరావతి రాజధానికి ప్రజల మద్దతు లేదని.. కేవలం ఒక వర్గానికి చెందిన, కొన్ని గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు మాత్రమే రాద్ధాంతం చేస్తున్నారనే వాదనకు బలం పెరుగుతుంది. అలాగే.. బలమైన సామాజిక వర్గం ఉన్న చోట్ల చాలా చోట్ల ఏకగ్రీవాలు జరుగుతాయనే ఆశ కూడా వారికి ఉంది. 

పైగా అనల్పంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ ఇవన్నీ కూడా పార్టీకి ప్లస్ అవుతాయని వారు నమ్ముతున్నారు. ఏ ఒక్క గ్రామంలోనూ నిర్దిష్టమైన ప్రభుత్వ వ్యతిరేకత కనపడడం లేదన్నది.. చాలా సర్వేలు తేల్చి చెబుతున్న సత్యం. నిమ్మగడ్డ తీరుపట్ల విసిగిపోయారు తప్ప.. వైసీపీ ఎన్నికలకు భయపడుతోందని అనుకోవడం భ్రమ.

అయితే, వారి ఆగ్రహాన్ని భయం కింద ప్రొజెక్టు చేయడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత సంక్షేమం అమలవుతున్నప్పుడు.. ఎన్నికలను ఎదుర్కొనడానికి ప్రభుత్వం ఎందుకు సంకోచించాలి? అనే లాజిక్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. 

ఆ ఆదేశాలు ఒక కామెడీ!

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. నిమ్మగడ్డ సర్వాధికారిగా చెలరేగిపోతున్నారు. కొందరు కలెక్టర్లను బదిలీ చేశారు. కొందరు పోలీసు అధికారుల్ని బదిలీ చేశారు. ఇవన్నీ అమల్లోకి వచ్చాయి. మంచి చెడుల ప్రస్తావన పక్కన పెడితే.. ఇవన్నీ ఆయనకు చట్టబద్ధంగా సంక్రమించిన అధికారాలు. 

అయితే, నిమ్మగడ్డ తాజాగా ఒక కామెడీ ఎపిసోడ్ నడిపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేయాలని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలని ఆయన ఆదేశించారు. లేదా.. అలాగని సీఎస్‌కు  లేఖ రాశారు. ఈ ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకోగలిగే హక్కు ఒక ఎన్నికల కమిషనర్ కు ఎలా ఉంటుందో.. సామాన్యులకు అర్థం కావడం లేదు. 

ఎన్నికల కమిషనర్ అంటే.. నోటిఫికేషన్ తర్వాత సంప్రాప్తించే విస్తృత అధికారాలతో మహా అయితే.. ఎన్నికల నిర్వహణలో ప్రత్యక్షంగా భాగం పంచుకునే రెవెన్యూ, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాల మీద ఆయన పెత్తనం చేయగలరు. అంతే తప్ప.. సీఎంఓలో అధికారులు, సలహాదార్ల మీదకూడా ఎలా కన్నెర్ర జేస్తారు. సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారిగా నిమ్మగడ్డ సముపార్జించిన విచక్షణ ఏమైందో అర్థం కావడం లేదు. 

చిన్న పిల్లల ఆటలాగా..

చాలా సందర్భాల్లో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్న తీరు.. స్కూలపిల్లల వ్యవహారంలాగా ఉంటుంది. క్లాసురూంలో పక్క పిల్లవాడితో తగాదా వస్తే.. నేరుగా హెడ్మాస్టర్ వద్దకెళ్లి.. ‘సార్ వాడు నన్ను కొడుతున్నాడు’ అని పితూరీలు చెప్పే చందంగా.. అయినదానికీ కానిదానికీ.. యెకాయెకిన గవర్నరు దగ్గరకు వెళ్లిపోతున్నారు.

గవర్నరుకు పితూరీలు చెబుతున్నారు. ఒక సందర్భంలో అడిగిన వెంటనే అపాయింట్మెంట్ కూడా గవర్నరు ఇవ్వలేదంటే.. నిమ్మగడ్డ వ్యవహార సరళి ఎలాంటి అభిప్రాయాల్ని అవతలి వారిలో కలిగిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 

ఏం జరగబోతోంది..?

గెలిచే అవకాశం లేక, ఆశలు వదిలేసుకుని కొందరు వెనక్కు తగ్గితే.. ఏకగ్రీవం కాగల పంచాయతీలు చాలా ఉన్నాయి. వేలం పాటలు, బేరసారాల వల్ల ఏకగ్రీవం అయ్యేవి కొన్ని.. అయితే ఇలాంటి వాటిలో అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవే ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఏకగ్రీవాలను కుంటిసాకులు చూపి.. రద్దు చేయడానికి నిమ్మగడ్డ ప్రయత్నించవచ్చు. 

అలాగే.. ఎన్నికలు- విజయాలు పూర్తయిన తర్వాత.. అరాచకంగా నిబంధనలు ఉల్లంఘించారనే నెపం మీద ప్రత్యర్థులు గెలిచిన స్థానాల్లో సర్పంచుల పదవులను ప్రభుత్వం రద్దు చేయడానికి కూడా ఆస్కారం ఉంది. ఏకగ్రీవాలకు సహకరించకుంటే.. వైసీపీ అదే పనిచేస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

అంతిమంగా మనకు కనిపిస్తున్నదేంటంటే.. ఎన్నికలకు సంబంధించిన రగడలు.. ఇవాళ్టితో పూర్తి కావడం లేదు. ఎన్నికల ప్రక్రియ నాలుగు విడతల్లో ముగియగానే.. అవి ముగియడం లేదు. ఇంకా కొన్ని నెలలపాటు  రావణకాష్టంలాగా రగులుతూనే ఉంటాయి. అది ప్రజల ప్రారబ్ధం.

.. ఎల్. విజయలక్ష్మి

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా

బాబు వెరీవెరీ ఇంపార్టెంట్ హామీని ఎలా మ‌రిచార‌బ్బా?