బీజేపీ, జనసేన మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో, వాళ్ల మధ్య శ్రీవాణి ట్రస్ట్ మరింత గ్యాప్ పెంపునకు కారణమైంది. టీటీడీ అధ్వర్యంలో నిర్వహించే శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపణలు గుప్పించారు. శ్రీవాణి ట్రస్ట్‌లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఏ మాత్రం పారదర్శకత లేదని ఒకటికి రెండుసార్లు పవన్‌కల్యాణ్ వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇవే ఆరోపణల్ని టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌తో పాటు చంద్రబాబునాయుడు ఇతరత్రా నాయకుల ఆరోపణల్ని తిరుపతి బీజేపీ నాయకుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు భానుప్రకాశ్‌రెడ్డి ఖండించారు. శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారాలన్నీ పారదర్శకంగా సాగుతున్నాయని, ఈవో ధర్మారెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నట్టు చెప్పుకొచ్చారు. తమ నాయకుడి ఆరోపణల్ని ఖండించడంపై జనసేన నేతలకు కోపం తెప్పించింది.
తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంలో టీటీడీని వెనకేసుకొచ్చిన భానుప్రకాశ్‌రెడ్డిపై మండిపడ్డారు. బీజేపీకి ప్రతినిధివా లేక టీటీడీకా అని భానుప్రకాశ్‌రెడ్డిని ఆయన నిలదీశారు. భానుప్రకాశ్‌రెడ్డి తీరు పిల్లికి ఎలుక సాక్ష్యంలా వుందని తప్పు పట్టారు. తమ నాయకుడిని తప్పు పట్టడానికి భానుకు ఉన్న అర్హతలు ఏంటని ఆయన ప్రశ్నించారు.
టీటీడీలో వైసీపీ మంత్రులకు కూడా జరగని రాజవైభవం బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డికి ఎలా జరుగుతోందని ఆయన నిలదీశారు. దర్శన టికెట్ల విషయంలో మంత్రి రోజాతో భాను పోటీ పడుతున్నారని విమర్శించారు. పవన్‌ను తప్పు పట్టిన భానుప్రకాశ్‌రెడ్డిపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కిరణ్‌రాయల్ నిలదీశారు. భానుప్రకాశ్‌రెడ్డి నిజస్వరూపం ఇప్పుడు బయటపడినట్టు ఆయన అన్నారు.