మారుతున్నది కేబినెట్ మాత్రమే కాదు, జగన్ కూడా!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కేబినెట్ మార్పిడి జరుగుతోంది. నిన్నట్నుంచి ఈ ప్రాసెస్ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, కేబినెట్ లో ఐదుగురు మంత్రులు మినహా మిగతావారంతా మారిపోతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇవ్వబోతున్నారు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కేబినెట్ మార్పిడి జరుగుతోంది. నిన్నట్నుంచి ఈ ప్రాసెస్ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, కేబినెట్ లో ఐదుగురు మంత్రులు మినహా మిగతావారంతా మారిపోతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇవ్వబోతున్నారు జగన్. అయితే ఈ క్రమంలో మారుతున్నది కేబినెట్ మాత్రమేనా అంటే కాదనే చెప్పాలి. ఓవైపు మంత్రివర్గాన్ని మార్చడమే కాదు, మరోవైపు జగన్ లో కూడా మార్పు కనిపిస్తోంది.

ఇన్నాళ్లూ జగన్ మాట్లాడిన విధానం వేరు. నిన్నట్నుంచి జగన్ మాట్లాడుతున్న తీరు వేరు. ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఓవైపు మంత్రులు మారిపోతున్నా, మరోవైపు క్యాడర్ మొత్తం జగన్ స్పీచ్ పైనే చర్చించుకుంటోంది. అప్పుడే ఎన్నికలొచ్చాయా అనే రీతిలో జగన్ మాటల తూటాలు పేల్చారు. ప్రతిపక్షాల్ని చీల్చి చెండాడారు.

అప్పుడెప్పుడో 2019 ఎన్నికల టైమ్ లో మాస్ జగన్ ను చూశాం. ఆయన స్పీచులు, పంచ్ డైలాగులు ప్రజల్ని ఉర్రూతలూగించాయి. మళ్లీ ఇన్నాళ్లకు జగన్ తనలోని 'మాస్'ను బయటపెట్టారు. బాక్సులు బద్దలవుతాయంటూ ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

రాష్ట్రం దివాళా తీస్తూ మరో శ్రీలంకగా మారుతుందంటున్న చంద్రబాబు వ్యాఖ్యల నుంచి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్ వరకు ప్రతి అంశంపై విరుచుకుపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే, అవి మాటలు కావు, జగన్ నోటి నుంచి వచ్చిన తూటాలు.

ఇంతకీ జగన్ లో ఒక్కసారిగా ఈ దూకుడు పెరగడానికి కారణం ఏంటి? పంచ్ డైలాగ్స్ తో విరుచుకుపడ్డానికి రీజన్ ఏంటి? ఇకపై తనే స్వయంగా విమర్శల్ని తిప్పికొట్టాలని ఫిక్స్ అయ్యారా? ఆయన మరోసారి జనంలోకి వెళ్లబోతున్నారా? అసలు జగన్ మాటల తూటాల వెనక వ్యూహం ఏంటి?

ఇన్నాళ్లూ సంక్షేమం… ఇప్పుడు రాజకీయం

ఈ సందర్భంగా కొన్నాళ్ల కిందట జగన్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను గుర్తు చేసుకోవాలి. సంక్షేమ పథకాల అమల్లో తలమునకలైన జగన్, ఇకపై తన నుంచి మరో కోణం చూస్తారంటూ స్వయంగా ప్రకటించారు. ఆ టైమ్ లో అంతా ముందస్తు ఎన్నికలు అంటూ గుసగుసలాడుకున్నారు. కానీ సంక్షేమంతో పాటు, రాజకీయాలు కూడా చేయాలని జగన్ ఫిక్స్ అయినట్టు నిన్నటి ప్రసంగం చూస్తే అర్థం అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. జగన్ 2.O నిన్నట్నుంచే మొదలైంది. ఇకపై ప్రతిపక్షాలకు చెడుగుడే.

జగన్ లో ఈ మార్పు వెనక మరో కారణాన్ని కూడా గమనించవచ్చు. ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టే మంత్రులు కొంతమంది మాత్రమే. పేర్నినాని, కొడాలి నాని, అనీల్ కుమార్ లాంటి అతికొద్దిమంది మాత్రమే ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా, దీటుగా సమాధానం ఇచ్చేవారు. 

ఇప్పుడు మంత్రిమండలి నుంచి నాని, అనీల్ లాంటి వ్యక్తులు తప్పుకుంటున్నారు. కొత్తగా కొలువుదీరే మంత్రులు అప్పుడే ఆ స్థాయిలో విరుచుకుపడతారని చెప్పలేం. అందుకే జగన్ స్వయంగా ఆ బాధ్యత తీసుకున్నట్టు కనిపిస్తోంది.

అదే ముక్కుసూటితనం.. అదే నిజాయితీ

రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలంటూ పదేపదే చెప్పే జగన్.. ఇప్పటికీ అవే విలువలకు కట్టుబడి ఉన్నారు. 

నిన్న ఆయన ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ దీనికి నిలువెత్తు ఉదాహరణ. “నేను మంచి చేస్తున్నానని మనసారా నమ్మితే మరోసారి ఆశీర్వదించండి” అన్నారు, అదే “నేను చెడు చేశానని భావిస్తే ద్వేషించండి” అంటూ నిండు సభలో జగన్ ఆన్-రికార్డ్ మాట్లాడారు. ఇంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పే నాయకుడు ఎవరైనా ఉన్నారా? అదీ ఆయన నిజాయితీ, అదే ఆయన ధైర్యం.

చంద్రబాబు, ఎల్లో మీడియా, పవన్ కల్యాణ్ ను గజదొంగల ముఠా అన్నారంటే జగన్ ఏ స్థాయిలో మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

మొత్తమ్మీద జగన్ ఊపు చూస్తుంటే, ఎన్నికలు వచ్చేశాయా అనే సందేహం కలుగుతుంది. ఆ రేంజ్ లో స్వైరవిహారం చేశారు ముఖ్యమంత్రి. అందుకే ఇప్పుడు క్యాడర్ లో చర్చంతా ఒక్కటే. మారుతోంది మంత్రివర్గం మాత్రమే కాదు, జగన్ కూడా.