ప్రపంచంలో ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా ఏపీతో లింకు పెట్టడం చంద్రబాబుకి అలవాటు. ఆ మధ్య ఏపీలో తాలిబన్ పాలన అంటూ రెచ్చిపోయారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా అదే పల్లవి అందుకున్నారు. ఏపీ మరో ఆఫ్ఘాన్ లా తయారైందని. తాలిబన్ పాలన కొనసాగుతోందని, పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడేవారు బాబు, ఆయన దత్త పుత్రుడు. ఇప్పుడు వీరిద్దరూ కొత్త పల్లవి అందుకున్నారు.
ఇప్పుడు శ్రీలంకతో ఏపీని పోలుస్తున్నారు. ఉచిత పథకాల వల్లే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందట. దాన్నుంచి బయటపడటానికి అవస్థలు పడుతుందట. ఈమధ్య ఓ రిటైర్డ్ మేథావి పేరుతో ఈ వాట్సప్ మెసేజ్ బాగా చక్కర్లు కొట్టింది. దీంతో చంద్రబాబు కూడా దీన్ని అందుకున్నారు. ఏపీ మరో శ్రీలంకలా తయారవుతోందంటూ గగ్గోలు పెడుతున్నారు.
పవన్ కూడా అదే స్క్రిప్ట్..
చంద్రబాబుకి బురదజల్లడమే పని కదా, అందుకే ఆప్ఘనిస్తాన్, శ్రీలంక అంటున్నారనుకుందాం. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. పవన్ కూడా అదే పల్లవి అందుకున్నారు. ఏపీలో శ్రీలంక లాంటి పరిస్థితులు వస్తాయని దెప్పిపొడుస్తున్నారు.
అసలు ఏపీకి, శ్రీలంకకి ఏమైనా పోలిక ఉందా. కేవలం చంద్రబాబు స్క్రిప్ట్ చదవడానికి మాత్రమే పవన్ ఉన్నారు కానీ, సొంతగా ఆలోచించి విమర్శలు చేసేంత సీన్ పవన్ కి లేదు అనిపించుకున్నారు.
సంక్షేమం ఆగిపోవాలంతే..?
ఏపీలో సంక్షేమ పథకాల అమలు ఎలాగైనా ఆపేయాలనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్. అమలు ఆగిపోతే.. ముందే చెప్పాం కదా అదే జరిగింది అంటారు, అమలు కొనసాగితే.. అయ్యయ్యో డబ్బులన్నీ పంచిపెడుతున్నారు, ఏపీ అప్పుల్లో కూరుకుపోతోంది, మరో శ్రీలంక అవుతుందని అంటారు. ఈ వ్యూహాన్నే ఇప్పుడు బాబు అమలు చేస్తున్నారు. పవన్ కొనసాగిస్తున్నారు.
ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలైనంత కాలం చంద్రబాబు ఇలా బాధపడుతూనే ఉంటారు. పవన్ కూడా పదే పదే బాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూనే ఉంటారు.
జనాల్ని జగన్ సోమరిపోతుల్ని చేస్తున్నారా..?
ఆర్థిక సాయం అనేదాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఆర్థిక సాయం పక్కదారి పడితే మాత్రం… అంతకు మించిన ప్రమాదకారి ఇంకోటి ఉండదు. ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, లేక దుర్వినియోగం చేసుకోవాలా అనేది లబ్ధిదారులపై ఆధారపడి ఉంటుంది.
ఇన్నాళ్లకు పవన్ కి కౌలు రైతులు గుర్తొచ్చారు, కౌలు రైతులు అవస్థలు పడకూడదని వారికి కూడా రైతు భరోసా అందిస్తోంది జగన్ కాదా..? ఇక్కడ చంద్రబాబు, పవన్ ఎగతాళి చేస్తోంది, విమర్శలు చేస్తోంది జగన్ పై అనుకుంటే పొరపాటే. జనాలపై వారికున్న చిన్నచూపుని వారు అలా బయటపెట్టుకుంటున్నారు.