ఈటీవీ సంస్థ మరోసారి శాటిలైట్ హక్కులు దక్కించుకునేందుకు, నిర్మాణ రంగంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర గతంలోనే బ్రేక్ చేసింది. చెప్పినట్టుగానే ఈటీవీ ఛానెల్ శాటిలైట్ హక్కులు దక్కించుకోవడం మొదలుపెట్టింది. దీని కోసం తన దగ్గరున్న వ్యక్తులతోనే ఓ సెటప్ పెట్టుకుంది. వరుసపెట్టి సినిమాలు కొనడం షురూ చేసింది. అలా మొదలుపెట్టిన కొన్నాళ్లకే ఇప్పుడు పునరాలోచనలో పడింది ఆ సంస్థ.
ఈటీవీ కొనుగోలు చేస్తున్న సినిమాలేవీ ఛానెల్ లో క్లిక్ అవ్వడం లేదు. ఉదాహరణకు డియర్ మేఘ సినిమానే తీసుకుంటే, ఆ సినిమాకు ఫస్ట్ ఎయిరింగ్ లో కేవలం 1.5 టీఆర్పీ వచ్చింది. యూ & ఐ అనే మరో సినిమా కొన్నారు. దానికి తొలి ప్రసారంలో 1.19 రేటింగ్ వచ్చింది. ఇక అవసరాల శ్రీనివాస్ నటించిన నూటొక్క జిల్లాల అందగాడు అనే సినిమాను తాజాగా ప్రసారం చేస్తే ఫస్ట్ ఎయిరింగ్ లో కేవలం 1.2 టీఆర్పీ వచ్చింది.
ఇలా లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్న సినిమాల కంటే.. ఆల్రెడీ లైబ్రరీలో ఉన్న చిరంజీవి, బాలకృష్ణ పాత సినిమాలకు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. వీటితో పాటు ఎగిరే పావురమా, పుట్టింటి పట్టుచీర, శత్రువు లాంటి సినిమాలకు టీఆర్పీలు వస్తున్నాయి. దీంతో ఈటీవీ యాజమాన్యం ఆలోచనలో పడింది. మరోసారి మూవీ ఎక్విజిషన్ ఆపేసి, పాత సినిమాలతోనే బండి నడిపిద్దామా అంటూ కొత్త చర్చ మొదలు పెట్టింది.
నిజానికి కాస్త విషయం ఉన్న సినిమాలు ప్రసారం చేస్తే, రేటింగ్ ఆటోమేటిగ్గా వస్తుంది. ఘనంగా ప్రచారం చేసుకోవడానికి వాళ్లకు ఈనాడు పత్రిక కూడా ఉంది. కానీ ఈటీవీ జనాలు ఆ దిశగా ఆలోచించడం లేదు.
చీప్ గా సినిమా వస్తోందని కొనేస్తున్నారు. రేటింగ్ రాకపోయేసరికి చర్చ మొదలుపెడుతున్నారు. ఈ విషయంలో ఆ సంస్థ ట్రెండ్ ను ఫాలో అవ్వడం లేదు. శాటిలైట్ విభాగంలో గడిచిన పదేళ్లలో వచ్చిన మార్పులు, బుల్లితెర ప్రేక్షకుల అభిరుచిని అది లెక్కలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. అందుకే ఇలా బొక్కబోర్లా పడుతోంది.
మొత్తమ్మీద రాబోయే రోజుల్లో శాటిలైట్ మార్కెట్ నుంచి ఈటీవీ మరోసారి తప్పుకునేలా కనిపిస్తోంది. అప్పుడు మళ్లీ జెమినీ, స్టార్ మా, జీ తెలుగు ఛానెళ్లు మాత్రమే మిగులుతాయి.