ఆశావ‌హులకు పిడుగులాంటి వార్త‌

మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు పిడుగులాంటి వార్త‌. ప్ర‌స్తుతం ఉన్న మంత్రి వ‌ర్గంలో 7 నుంచి 10 మందిని కొన‌సాగిస్తార‌ని ముఖ్య‌మంత్రి సొంత ప‌త్రిక రాయ‌డంతో ఆశావహులు ఆందోళ‌న చెందుతున్నారు. కొత్త‌గా 14…

మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేల‌కు పిడుగులాంటి వార్త‌. ప్ర‌స్తుతం ఉన్న మంత్రి వ‌ర్గంలో 7 నుంచి 10 మందిని కొన‌సాగిస్తార‌ని ముఖ్య‌మంత్రి సొంత ప‌త్రిక రాయ‌డంతో ఆశావహులు ఆందోళ‌న చెందుతున్నారు. కొత్త‌గా 14 నుంచి 17 మందికి మాత్ర‌మే మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క నుంద‌ని ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. వీరిలో సీఎం జ‌గ‌న్‌ను మిన‌హాయిస్తే, 150 మందీ మంత్రి ప‌ద‌వులను ఆశిస్తున్న వాళ్ల కిందే లెక్క‌. సాక్షి తాజా క‌థ‌నం ప‌లు ర‌కాల భ‌యాల్ని రేకెత్తిస్తోంది. సాక్షి క‌థ‌నం ప్ర‌కారం దాదాపు స‌గానికంటే కొంచెం త‌క్కువ మంది మంత్రులు కొన‌సాగుతార‌నే సంకేతాల్ని ఇచ్చింది. 

ఇంత వ‌ర‌కూ ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే తిరిగి కొన‌సాగుతార‌నే చ‌ర్చ జ‌రుగుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తిరిగి మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకునే వారి జాబితా సాక్షిలో రెట్టింపు కావ‌డం…  ప్ర‌భుత్వ పెద్ద‌లకు తెలియ‌కుండా రాసి వుండ‌ర‌నే చ‌ర్చ జరుగుతోంది. అలాగే మొద‌టి  మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యం కంటే.. ఇప్పుడు మరింత అధికంగా ప్రాధాన్యత దక్కుతుందని రాయ‌డం సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించాలి. ఈ స‌మాచారం మాత్రం సంబంధిత సామాజిక వ‌ర్గాల నేత‌ల్లో కాస్త ఉత్సాహం నింపేదే.

గ‌త కేబినెట్‌లో ఏడుగురు బీసీలు, ఐదుగురు ఎస్సీలు, న‌లుగురు కాపులు, న‌లుగురు రెడ్ల‌కు అవకాశం క‌ల్పించారు. ఎస్టీ, మైనార్టీ, క్ష‌త్రియ‌, వైశ్య‌, క‌మ్మ సామాజిక వ‌ర్గాల నుంచి ఒక్కొక్క‌రికి చోటు క‌ల్పించారు. ఈ ఒక్కొక్క‌రి విష‌యంలో ఎలాంటి మార్పు ఉండ‌క‌పోవ‌చ్చు. ఇక స‌మ‌స్య‌ల్లా అంత‌కు మించి ప‌దువులు పొందిన సామాజిక‌వ‌ర్గాల‌దే.

ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల్ని సాక్షి క‌థ‌నాలు ప్ర‌తిబింబిస్తాయ‌నే పేరుంది. ఈ నేప‌థ్యంలో మంత్రివ‌ర్గ కూర్పుపై ఇవాళ్టి ఆ ప‌త్రిక క‌థ‌నాన్ని విశ్లేషిస్తే… బీసీల‌కు, ఎస్సీల‌కు క‌నీసం రెండేసి చొప్పున‌ మంత్రి ప‌ద‌వులు పెరిగే అవకాశం ఉంది. ఇక కాపులు, రెడ్ల సామాజిక వ‌ర్గాల ప‌ద‌వుల్లో ఒక్కొక్క‌టి చొప్పున కోత విధించే అవకాశం ఉంది. 

ఒక‌వైపు సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా కాపులు, రెడ్ల సామాజిక వ‌ర్గాల్లో కోతతో పాటు 14 నుంచి 17 మందికి మాత్ర‌మే కొత్త వారికి అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం ఆయా కులాల నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల‌ను మాన‌సికంగా సంసిద్ధ‌త చేసే క్ర‌మంలోనే సాక్షిలో మంత్రివ‌ర్గ కూర్పుపై ప్ర‌త్యేక క‌థ‌నం వ‌చ్చి వుంటుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.