నరేంద్రమోడీ గారు అమెరికాలో పర్యటించడం భారత ప్రధానమంత్రి హోదాలోనే అయినా, అక్కడ పెట్టుబడుల ప్రకటనలను చూస్తే మాత్రం ఆయన గుజరాత్ మాజీ సీఎం హోదాలో తన సొంత రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడానికి వెళ్లారేమో అనుకోవాల్సి వస్తోంది. ఈ విషయమై దేశంలోని ఇతర రాజకీయ పార్టీలు పెద్దగా కిక్కురుమనకపోయినా, శివసేన మాత్రం విరుచుకుపడుతూ ఉంది. ప్రధాని మోడీ తీరు కేవలం గుజరాత్ కోసమే అన్నట్టుగా ఉందంటూ శివసేన ధ్వజమెత్తింది.
ఇప్పటికే అన్ని ప్రాజెక్టులనూ గుజరాత్ బాట పట్టిస్తున్నారనేది మోడీ, అమిత్ షాల పై చాన్నాళ్లుగా ఉన్న విమర్శ. జరుగుతున్న పరిణామాలు కూడా అదే రీతిన ఉండటం గమనార్హం. ఆఖరికి బీసీసీఐ క్రికెట్ మ్యాచ్ లను నిర్వహించడం విషయంలో కూడా గుజరాత్ లోని నరేంద్రమోడీ స్టేడియం తప్ప దేశంలో మరే స్టేడియం లేనట్టుగా తయారైంది.
గుజరాతీ లాబీతో చాలా మంది ఆటగాళ్లు జాతీయ జట్టులో కొనసాగుతున్నారనే విమర్శ ఉంది. మరి ఆటలు, పాటల సంగతలా ఉంటే.. మోడీ తాజా అమెరికా పర్యటనలో భాగంగా గుజరాత్ లో ఒక పెద్ద సెమికండక్టర్ ప్లాంట్ ను ఏర్పరిచే ఒప్పందం కుదుర్చుకుంది అమెరికన్ సంస్థ మైక్రాన్. అహ్మదాబాద్ ఊరవతల ఈ ప్లాంట్ ను ఏర్పరచనున్నట్టుగా ప్రకటించింది. సుమారు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సెమికండక్టర్ ప్లాంట్ ను ఏర్పరచనున్నారట. దీని వల్ల కనీసం ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా.
వాస్తవానికి ఈ సెమికండక్టర్ ప్లాంట్ ప్రతిపాదన మొదట పుణేకు వచ్చింద. పుణేలో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందనే ప్రచారం జరిగింది. అయితే అటు తిరిగి ఇటు తిరిగి గుజరాత్ బాట పట్టింది. శివసేన పత్రిక సామ్నా ఈ విషయాన్ని ప్రస్తావిస్తోంది.
ఇక గాంధీ నగర్ సమీపంలో తమ కంపెనీ గ్లోబల్ ఫిన్ టెక్ ఆపరేరషన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. దీని కోసం గూగుల్ ఏకంగా 82 వేల కోట్ల రూపాయల వ్యయాన్ని చేయబోతోందట!
ఇలా మోడీ అమెరికా పర్యటన సందర్భంగా చెప్పుకోదగిన అంశాలు గుజరాత్ విషయంలోనే వినిపిస్తున్నాయి. భారీ పెట్టుబడులు, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచే ప్రాజెక్టుల పేర్లు వినిపిస్తే వాటి విషయంలో గుజరాత్ అనే పేరే తప్ప.. ఆఖరికి తాము డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ చెప్పకునే యూపీ విషయంలోనో, లేక మధ్యప్రదేశో, ఇంకా బీజేపీనే అధికారంలో ఉన్న మహారాష్ట్ర వంటి వాటిని కూడా పట్టించుకునే ఆసక్తితో లేనట్టుగా ఉన్నారు.