సినిమా స్టార్ల రెమ్యూనిరేషన్ల విషయంలో పదుల కోట్ల రూపాయల నంబర్లు పోయి అన్నీ వందల కోట్ల రూపాయల నంబర్లే వినిపిస్తున్నాయి! ప్రత్యేకించి స్టార్ హీరోల రెమ్యూనిరేషన్లు అయితే వందల కోట్లు అని చెప్పుకోవడం చాలా రొటీన్ అయిపోయింది.
పది కోట్లు, ఇరవై కోట్ల రూపాయలు అనే నంబర్లు మాయమై, ఇప్పుడు వంద కోట్లా, రెండు వందల కోట్లా.. అనే నంబర్లే వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ.. ఇలాంటి భాషల్లో ఏ స్టార్ హీరో రెమ్యూనిరేషన్ అయినా వంద కోట్ల పై మాటే అనే టాక్ నడుస్తూ ఉంది.
మరి కేవలం సినిమాలకే కాదు, టెలివిజన్ షోల విషయంలో కూడా తారల పారితోషికం ఆకాశాన్ని అంటుతోందని స్పష్టం అవుతోంది. టెలివిజన్ మార్కెట్ ను కూడా ఇప్పుడు సినిమా వాళ్లే మింగేస్తున్నారు. వివిధ రకాల షో లలో సినిమా స్టార్లే అక్కడా రాజ్యమేలుతున్నారు. ఇలాంటి క్రమంలో సినిమా స్టార్ లకు మంచి ఆర్థిక వనరుగా నిలుస్తోంది బిగ్ బాస్.
ఏడెనిమిదేళ్ల కిందట ప్రాంతీయ భాషల్లో కూడా బిగ్ బాస్ షో ప్రారంభమైంది. మొదట్లో సినిమా వాళ్ల ద్వారా ప్రచారం పొందిన ఈ షో, ఇప్పుడు వారికి కావాల్సినంత రెమ్యూనిరేషన్ ను ఎదురిస్తున్నట్టుగా ఉంది.
తమిళ బిగ్ బాస్ ఏడో సీజన్ కు గానూ కమల్ హాసన్ ఏకంగా 130 కోట్ల రూపాయల పారితోషికాన్ని పొందనున్నాడట. తెలుగులో బిగ్ బాస్ హోస్టులు మారిపోతూ వస్తున్నారు కానీ, తమిళంలో మాత్రం కమల్ స్టడీగా కొనసాగుతూ ఉన్నాడు. ఫస్ట్ సీజన్ నుంచి కమల్ కార్యక్రమానికి హోస్టుగా ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏడో సీజన్ కు గానూ 130 కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ పొందుతున్నాడట కమల్ హాసన్.
మరి ప్రాంతీయ భాషల టీవీ షోల విషయంలో ఇది భారీ నంబర్ అనుకోవాలి. కమల్ హాసన్ ఒక సినిమాను చేస్తే తీసుకునే పారితోషికానికి మించి ఉన్నట్టుగా ఉంది ఈ ఫిగర్. అయితే కమల్ ఇప్పుడు ఒక సినిమా పూర్తి చేయాలంటే కనీసం ఏడాది పట్టొచ్చు. అయితే బిగ్ బాస్ కు కేటాయించే సమయం దాంతో పోలిస్తే చాలా తక్కువే!