చిత్ర పరిశ్రమలో ఆర్జీవీది విచిత్ర పంథా. లోకానికి విరుద్ధమనే మాటకు ఆర్జీవీ మనస్తత్వం నిదర్శనంగా నిలుస్తుంది. ఎడ్డం అంటే తెడ్డం అంటారాయన. బర్త్‌డే విషస్ చెప్పిన వారికి తన మార్క్ అభిప్రాయాన్ని వెల్లడించి ఔరా అనిపించారు.
ఇవాళ ఆర్జీవీ పుట్టిన రోజు. సాధారణంగా ఎవరైనా పుట్టిన రోజంటే జీవితంలో అత్యంత ఆనందకరమైన దినంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ బర్త్‌డేను ఆర్జీవీ మాత్రం డెత్‌డేగా చూడడం ఆర్జీవీకే చెల్లింది.
వివాదాస్పద దర్శకుడి పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రముఖ గేయ రచయిత సిరాశ్రీ తనదైన శైలిలో ప్రశంసలతో ముంచెత్తాడు. అయితే తనను రాముడితో పోల్పడాన్ని ఆర్జీవీ సంతృప్తి చెందలేదు. రాముడి ప్రత్యర్థితో పోల్చి ఉంటే బాగుండేదని ఆర్జీవీ ఆకాంక్షించడం బర్త్ డే ప్రత్యేకంగా చెప్పొచ్చు.
సైకిల్ చైనుతో సినిమా
సైకీనే మార్చివేసి చరితాత్ముండై
జైకొట్టిన ఛీకొట్టిన
రాకెట్టుగ దూసుకెళ్లు రాముండితడే… అని ఆర్జీవీపై సిరాశ్రీ ఓ పద్యం రాశారు. ఈ పద్యంపై వర్మ తన మార్క్ స్పందన వెల్లడించారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే… తనను రాముడితో కాకుండా రావణాసురుడితో పోలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆర్జీవీ కోరికను కాదనకుండా మరో పద్యాన్ని సిరాశ్రీ అల్లాడు.
ఆర్జీవీ పద్ధతిలో
దర్జాగా బ్రతుకువారు తరచిన లేరే!
ఆర్జించిన జ్ఞానమునే
గర్జించును సింహమట్లు కడు నేర్పరిగా! అని రాసుకొచ్చారు. మీరు అనుకుంది సాధించారంటూ సిరాశ్రీ పద్యంపై వర్మ కామెంట్ చేయడం విశేషం. ఎవరైనా రాముడిగా పిలిపించుకోవడం గౌరవంగా భావిస్తారు. కానీ వర్మ మాత్రం తనను రావణాసురుడిగా పిలిపించుకోవడం ఇష్టపడ్డారు. ప్రతి విషయంలోనూ తనదంటూ ప్రత్యేక లోకమని వర్మ చాటి చెబుతారనేందుకు ఇదే ఉదాహరణ.