ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థతను ఎల్లో దిగ్గజ పత్రిక “ఈనాడు” కన్నీటి సిరాతో రాయాల్సి వచ్చింది. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న జగన్ సంకల్పం ఎంత దృఢమైందో “ఈనాడు” మరోసారి చాటి చెప్పింది. ఈనాడు తన కథనం ద్వారా రామోజీ ఓర్వలేనితనాన్ని, వైఎస్ జగన్ హీరోయిజాన్ని ఏపీ ప్రజానీకానికి తెలియచెప్పింది.
రాజధాని అమరావతి (ఆర్5 జోన్)లో జగన్ సర్కార్ 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలను ఇటీవల పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రాజధానేతర ప్రాంతానికి చెందిన పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారంటూ టీడీపీ మద్దతుతో కొందరు న్యాయ స్థానాల ద్వారా అడ్డుకునే కుట్రలకు తెరలేపారు. అయితే న్యాయ స్థానంలో వారి పన్నాగాలు పారలేదు. చివరికి పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న జగన్ సంకల్పమే గెలిచింది.
ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో పేదలకు త్వరగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడాన్ని రామోజీరావు నేతృత్వంలోని జీర్ణించుకోలేకపోతోంది. కేవలం ఒక్క నెలలోనే అనుమతులు ఎలా ఇస్తారని, అలాగే కోర్టు తీర్పును కనీసం పరిగణలోకి తీసుకోకుండా అంత తొందరేంటి? అని ప్రశ్నిస్తూ ఈనాడు పత్రిక కథనం రాసుకొచ్చింది.
ఈ ఒక్క కథనం చాలు… పేదలకు రామోజీరావు ఎంత వ్యతిరేకో చెప్పడానికి అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం మొత్తం 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, వీరిలో 47 వేల మందికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇళ్లు మంజూరు చేసింది. ఢిల్లీలో సోమవారం జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) సమావేశంలో అనుమతిలిచ్చింది. మొదటి విడతగా వీటిని ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రెండో విడతలో మిగిలిన వారికి మంజూరు చేస్తామని స్పష్టం చేసింది.
ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు చొప్పున రూ.705 కోట్లు మంజూరు చేయనుంది. రాష్ట్రానికి ఏ రూపంలోనైనా కేంద్ర ప్రభుత్వ సాయాన్ని ఆహ్వానించాలి. ఇంకా అనేక రకాలుగా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం వుందని కేంద్రానికి తెలియచెప్పాల్సిన మీడియా… ఆ పని వదిలేసి అసలు ఎలా ఇస్తారని ప్రశ్నించడం ఆశ్చర్యం, ఆగ్రహం కలిగిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం, పేదలపై రామోజీరావు అక్కసును తెలియజేసే ఈ రాతలను ఒక్కసారి చూద్దాం.
“హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఇళ్ల పట్టాల పంపిణీ వుంటుందని, తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు కోరే హక్కు లబ్ధిదారులకు ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఇలా అడగ్గానే, కేంద్రం అలా ఆమోద ముద్ర వేసింది. ఈ మొత్తం వ్యవహారం నెలలోపే పూర్తి కావడం గమనార్హం”
ఈ కథనం దురుద్దేశం ఏంటి?… సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని పేదలకు ఇళ్ల నిర్మాణానికి సహకరించకూడదా? అలాగే వైసీపీ ప్రభుత్వం అడిగిన వెంటనే స్పందించకుండా… పదవీ కాలం పూర్తయ్యే వరకూ కాలయాపన చేయాలా? నెలలోపే అన్నీ సానుకూలంగా స్పందించారని ఈనాడు పత్రిక ఏడ్వడం ఏంటి?
వైసీపీ ప్రభుత్వంపై నిత్యం ఎల్లో మీడియా రాసే ఏడ్పుగొట్టు కథనాల్లో ఇదొకటి. కానీ, పేదల సొంతింటి కల సాకారానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం చేస్తుంటే సంతోషించకుండా, దుర్మార్గ రాతలను రాసి తమ నైజాన్ని బహిర్గతం చేసుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు సీఎం జగన్ సమర్థతను ఈనాడు కథనం తెలియజేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెగెటివిటీలో పాజిటివిటీ అంటే ఇదే కాబోలు. ఎల్లో మీడియా శాపనార్థాలే జగన్కు శ్రీరామ రక్ష.