వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన దస్తగిరి సీబీఐకు అప్రూవర్ గా మారాడు. అప్రూవర్ గా మారిన దగ్గరినుంచి బెయిలుపై బయటే ఉన్నాడు. అదొక్కటే కాదు. ఒక రకంగా చెప్పాలంటే.. అప్రూవర్ మారిన తర్వాత.. అతనికి రాజభోగాలు నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాగా ఇదే వివేకాహత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర రెడ్డిని అసలు నిందితులుగా నిరూపించాలని సీబీఐ పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. వారు అలా చేయడానికి దస్తగిరి అప్రూవర్ గా మారి ఇచ్చిన వాంగ్మూలం తప్ప.. వారి వద్ద ప్రత్యేకమైన సాక్ష్యాలు ఏమీ లేనేలేవు.
అయితే.. తమకు కావాల్సిన విధంగా సాక్ష్యాలు ఇచ్చాడు గనుక.. అప్పటినుంచి అప్రూవర్ దస్తగిరిని సీబీఐ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తోంది. దస్తగిరిని ప్రతి విషయంలోనూ సమర్థిస్తూ వస్తోంది. దీన్ని అలుసుగా చేసుకుని దస్తగిరి విచ్చలవిడి దందాలతో రెచ్చిపోతున్నట్టుగా, వాటిని దాచుకోవడానికి రోజుకో డ్రామా ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది.
సహజంగానే ఉన్న నేరప్రవృత్తికి తోడు.. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా తన రేంజి పెరిగిందని దస్తగిరి ఫిక్సయ్యాడు. సీబీఐ రక్షణ కవచం అతినికి అదనం. ఇక సెటిల్మెంట్లు, దందాలు లాంటివి అనేకం సాగిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడో శ్రీకాళహస్తిలో ఉండే పంచాయతీల విషయంలో కూడా దస్తగిరి తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వివేకానే హత్య చేసిన వాడిని గనుక.. తనను చూస్తే ఎవ్వరైనా భయపడతారని, సెటిల్మెంట్లు తనకు కలిసొస్తాయని దస్తగిరి అనుకుంటున్నట్టుగా ఉంది. దానికి తోడు అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడం.. వారిని పీడించి మరీ వసూలు చేయడం కూడా కొనసాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
తన దగ్గర అప్పు తీసుకున్న కుటుంబం సకాలంలో చెల్లించకపోవడంతో వారి ఇంటినుంచి మైనర్ బాలుడిని దస్తగిరి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్టుగా, అతడిని నిర్బంధించి, హింసించి తనకు అప్పు వెంటనే చెల్లించాలని బాలుడి తల్లిని బెదిరించినట్టుగా దస్తగిరి పై కేసులు నమోదు అయ్యాయి. ఇలాంటి అరాచకాలపై పోలీసులు కేసు నమోదు చేస్తే.. అది కూడా తనమీద జరుగుతున్న కుట్రగా చాటి తప్పించుకోవడానికి దస్తగిరి ప్రయత్నిస్తుండడమే విశేషం.
తన మీద తన భార్య షబానా మీద తప్పుడు కేసులు పెట్టారని, ఏదో ఒక కేసులు ఇరికించి తనను జైలుకు పంపించాలని కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ దస్తగిరి జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు తనను బెదిరిస్తున్నారని కూడా అందులో పేర్కొన్నారు.
అదేపనిగా ఎంపీ అవినాష్ మీద ఆరోపణలు చేస్తూ.. తనంత తాను దందాలు కొనసాగిస్తూ, ఆ దందాల్లో ఇబ్బంది వచ్చినా సరే.. అవినాష్ రెడ్డి మీదనే బురద చల్లుతూ దస్తగిరి చాలా తెలివైన సరికొత్త డ్రామాలు నడిపిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.