ప‌వ‌న్‌కు ద‌మ్ము, ధైర్యం వుంటే…ఆ ప్ర‌క‌ట‌న చేయాలి!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే తెలియ‌డం లేదు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డ‌మే ఆయ‌న నైజంగా క‌నిపిస్తోంది. నిజాల‌తో , హామీల‌తో సంబంధం లేకుండా, త‌న‌కు గిట్ట‌ని పాల‌కుడైతే చాలు…ఎన్నైనా తిడ్తాన‌నే  ఏకైక ఎజెండాతో ఆయ‌న…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయ‌న‌కే తెలియ‌డం లేదు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డ‌మే ఆయ‌న నైజంగా క‌నిపిస్తోంది. నిజాల‌తో , హామీల‌తో సంబంధం లేకుండా, త‌న‌కు గిట్ట‌ని పాల‌కుడైతే చాలు…ఎన్నైనా తిడ్తాన‌నే  ఏకైక ఎజెండాతో ఆయ‌న రాజ‌కీయ పంథా సాగుతోంది. పులివెందుల రౌడీయిజం అంటూ ఆయ‌న కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకున్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్‌పై వైసీపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌సంగిస్తూ… కాపుల‌కు ఇస్తామ‌న్న రిజ‌ర్వేష‌న్లు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న ఐదేళ్ల క్రితం వేసి వుంటే స‌బ‌బుగా వుండేది. ఎందుకంటే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తాన‌ని ఎన్నిక‌ల హామీ ఇచ్చింది త‌న ద‌త్త తండ్రి చంద్ర‌బాబునాయుడ‌నే వాస్త‌వాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రిచిన‌ట్టున్నారు.

చంద్ర‌బాబు త‌న ఎన్నిక‌ల హామీని నిల‌బెట్టుకోవాల‌నే క‌దా కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. అప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ప‌వ‌న్ అనుకూలంగా ఉన్నారు. టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్దతుగా ప‌వ‌న్ విస్తృత ప్ర‌చారం చేశారు. 2014 నుంచి 2019 వ‌ర‌కూ ప‌వ‌న్ బ‌ల‌ప‌రిచిన పార్టీలే అధికారంలో ఉన్నాయి. నాడు ఎన్నిక‌ల హామీని నెర‌వేర్చాల్సిన బాధ్య‌త వుంద‌ని చంద్ర‌బాబుపై ఒత్తిడి తీసుకురాక‌పోగా, అస‌లు త‌న చేత‌ల్లో రిజ‌ర్వేష‌న్లు లేవ‌ని తెగేసి చెప్పిన వైఎస్ జ‌గ‌న్‌ను ఇప్పుడు నిల‌దీయ‌డం ఏంటో ప‌వ‌న్‌కే తెలియాలి.

త‌న ప్ర‌భుత్వం వ‌స్తే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుకు ప్ర‌క‌టించ‌లేదు? త‌న సామాజిక వ‌ర్గం కోసం ఆ మాత్రం ప్ర‌క‌ట‌న చేయ‌లేరా? ద‌మ్ము, ధైర్యం లేవా? గుండెల నిండా ధైర్యం వుంద‌ని ప‌వ‌న్ ప‌దేప‌దే చెబుతుంటారు క‌దా! త‌న సామాజిక వ‌ర్గం ఓట్లు కావాలే త‌ప్ప‌, వారికి రిజ‌ర్వేష‌న్లు వ‌ద్దా? చంద్ర‌బాబు, వైఎస్ జ‌గ‌న్ ఇత‌ర సామాజిక వ‌ర్గాలు కాబ‌ట్టి రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌లేద‌ని అనుకుందాం. 

మ‌రి సొంత సామాజిక వ‌ర్గంపై విప‌రీత‌మైన ప్రేమ ఉంద‌ని చెబుతున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త‌న‌ను అధికారంలోకి తెస్తే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తాన‌ని ఒక్క హామీ ఇవ్వ‌లేక‌పోతున్నారెందుకు?  ఇదేనా చిత్త‌శుద్ధి?  ఇత‌రుల‌ను ప్ర‌శ్నించే ముందు, కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై త‌న వైఖ‌రి ఏంటో బ‌య‌ట పెట్టాలి.