ప్ర‌పంచ దేశాల్లో.. విడాకుల విచిత్రాలు!

ప్ర‌పంచంలో అత్య‌ధిక శాతం విడాకులు న‌మోద‌వుతున్న దేశం ల‌గ్జంబ‌ర్గ్. యూర‌ప్ లో బాగా అభివృద్ధిని సాధించిన దేశాల్లో ఒక‌టైన ల‌గ్జంబ‌ర్గ్ బాగా ప‌రిమిత జ‌నాభాతో ఉన్న దేశం కూడా. దీని జ‌నాభా కేవలం ఐదు…

ప్ర‌పంచంలో అత్య‌ధిక శాతం విడాకులు న‌మోద‌వుతున్న దేశం ల‌గ్జంబ‌ర్గ్. యూర‌ప్ లో బాగా అభివృద్ధిని సాధించిన దేశాల్లో ఒక‌టైన ల‌గ్జంబ‌ర్గ్ బాగా ప‌రిమిత జ‌నాభాతో ఉన్న దేశం కూడా. దీని జ‌నాభా కేవలం ఐదు ల‌క్ష‌లు మాత్ర‌మే. అయితే అత్య‌ధిక విడాకుల శాతం ఉన్న దేశం కూడా ఇదే!

ఈ ఐదు ల‌క్ష‌ల మందిలో ఏకంగా 87 శాతం మంది క‌నీసం ఒక్క‌సారి అయినా విడాకులు తీసుకున్న వారేన‌ట‌! ఈ స్థాయిలో విడాకుల శాతం ఉన్న దేశం మ‌రోటి లేదు. ఇలా ప్ర‌పంచంలోనే ఎక్కువ శాతం విడాకులు తీసుకున్న వారున్న దేశంగా లగ్జంబ‌ర్గ్ నిలుస్తోంది.

మ‌రి ఇంత శాతం విడాకులు ఉన్నా.. ఆ దేశంలో జ‌నాభా పెరుగుద‌ల మాత్రం  బాగానే ఉంద‌ట‌. విడాకులు తీసుకోవాల‌నే జంట క‌నీసం రెండేళ్లు అయినా కాపురం చేసి ఉండాల‌నేది అక్క‌డ నిబంధ‌న‌!

విడాకుల చ‌ట్టం లేని దేశ‌మ‌దే!

ఇప్ప‌టి వ‌ర‌కూ స‌రైన విడాకుల చ‌ట్టం లేని దేశంగా ఫిలిఫ్పైన్స్ నిలుస్తోంది. ఇక్క‌డ విడాకుల చ‌ట్టం తీసుకురావ‌డానికి వివిధ ప్ర‌య‌త్నాలు అయితే జ‌రిగాయి కానీ, దాన్ని వ్య‌తిరేకిస్తున్న వారు గ‌ట్టిగా ఉండ‌టంతో ఇప్పటి వ‌ర‌కూ వైవాహిక విడాకుల చ‌ట్టం అధికారికంగా లేని దేశంగా ఫిలిప్పైన్స్ నిలుస్తోంది. ఐక్య‌రాజ్య‌స‌మితి గుర్తింపును క‌లిగి ఉన్న దేశాల్లో ఇలా విడాకుల చ‌ట్టం లేని దేశాల్లో ఒకే ఒక‌టి ఫిలిప్పైన్స్. దీంతో పాటు వాటిక‌న్ కు కూడా ఇలాంటి చ‌ట్టం లేదు!

ఇండియా.. చ‌ట్టం ఉన్నా!

భార‌త‌దేశంలో విడాకుల చ‌ట్టం 1955లో వ‌చ్చింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ను తీసుకు వ‌చ్చింది నెహ్రూ ప్ర‌భుత్వం. అయితే ఈ చ‌ట్టం ప‌ట్ల అప్పుడే సంప్ర‌దాయ వాదులు విరుచుకుప‌డ్డారు. విడాకుల చ‌ట్టాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయితే నెహ్రూ ప్ర‌భుత్వం ఈ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింది. అయితే ఈ చ‌ట్టం ప‌ట్ల కొన్నేళ్ల కింద‌టి వ‌ర‌కూ కూడా బాగా అవ‌గాహ‌న త‌క్కువ దేశంలో. మూడు ద‌శాబ్దాల కింద‌టి వ‌ర‌కూ కూడా భార్య‌కు భ‌ర‌ణం అనేది లేకుండా వ‌దిలేసిన వారు, ఆమెను వ‌దిలేసి వేరే పెళ్లి చేసుకున్న వారూ కోకొల్ల‌లు. అయితే ఈ పురుషాధిక్య ధోర‌ణి క్ర‌మంగా చ‌ట్టం ద్వారా త‌గ్గుముఖం ప‌ట్టింది.

ఇండియా విష‌యంలో మ‌రో విశేషం ప్ర‌పంచంలో విడాకుల శాతం బాగా త‌క్కువ‌గా ఉన్న దేశం ఇండియానే. భార‌త‌దేశంలో విడాకుల శాతం కేవ‌లం ఒకే ఒక్క‌టి. గ‌త కొంత‌కాలంలోనే ఇలాంటి కేసులైనా కాస్త పెరుగుతున్నాయి, కానీ రాజీ ధోర‌ణితో చ‌ట్ట‌ప‌రంగా విడిపోకుండా వ్య‌క్తిగ‌తంగా వేరైన వారే ఎక్కువ‌!

ఐర్లాండ్ లో 1997లో!

ఇండియాలోనే 1955 నాటికే విడాకుల చ‌ట్టం రాగా, యూర‌ప్ లో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక‌టైన ఐర్లాండ్ లో మాత్రం చాలా లేటుగా విడాకుల చ‌ట్టాన్ని చేసుకున్నారు. 1997లో ఐర్లాండ్ లో విడాకుల చ‌ట్టం రూపొంది, అమ‌ల్లోకి వ‌చ్చింది. ఇలా ఆల‌స్యంగా విడాకుల చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చిన దేశంగా త‌న సాటి యూరోపియ‌న్ దేశాల మ‌ధ్య‌న ప్ర‌త్యేకంగా నిలుస్తోంది ఐర్లాండ్.

మ‌హిళ‌ల‌కు అక్క‌డ వెసులుబాటు!

ఇస్లామిక్ సంప్ర‌దాయాల్లో త‌లాక్ ఉన్న‌ట్టుగా ఆస్ట్రేలియాలోని కొన్ని తెగ‌ల్లో మ‌హిళ‌ల‌కు ఇలాంటి స‌దుపాయం ఉంద‌ట‌. భ‌ర్త‌తో విడిపోవాల‌ని ఆమె అనుకుంటే అత‌డికి ఒకే మాట చెప్పేసి ఆమె వెళ్లిపోవ‌చ్చు. దీనికి భ‌ర్త అంగీకారం కూడా పెద్ద‌గా అవ‌స‌రం లేదు. ఇస్లాంలో ట్రిపుల్ త‌లాక్ కూడా ఇదే బాప‌తే. చాలా ఇస్లామిక్ దేశాల్లో కూడా ట్రిపుల్ త‌లాక్ చ‌ట్టం అమ‌ల్లో లేదు. ఇండియాలో మోడీ ప్ర‌భుత్వం దీన్ని ర‌ద్దు చేసింది. ముస్లిం మ‌హిళ‌ల నుంచి దీని ప‌ట్ల సానుకూల స్పంద‌న వ‌చ్చింది.

కార‌ణాలు ఇవే!

ప్ర‌పంచంలో విడాకుల‌కు ప్ర‌ధాన కార‌ణాల్లో స‌ఖ్య‌త లేక‌పోవ‌డం అనేదే ముందు వ‌ర‌స‌లో ఉంది. విడిపోతున్న వారిలో ఏకంగా 44 శాతం మంది ఈ కార‌ణం చూపి విడిపోతున్నారు. ఇక వివాహేత‌ర సంబంధం అనే కార‌ణంతో 18 శాతం మంది విడిపోతున్నార‌ట‌. డ్ర‌గ్స్-ఆల్కాహాల్ కార‌ణంగా తొమ్మిది శాతం మంది, విడిపోతున్న వారిలో ఆరు శాతం మంది ఫిజిక‌ల్ -మెంట‌ల్ అబ్యూస్ అనే కార‌ణాన్ని చూపుతున్న‌ట్టుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి.