ఒక్క ఛాన్స్ ప్లీజ్.. జగన్ బాటలో లోకేష్

2019 ఎన్నికల్లో “ఒక్క అవకాశం” అంటూ జగన్ ప్రచారానికి వెళ్లారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే స్లోగన్ అందుకున్నారు. తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అయితే అక్కడ జగన్ కు,…

2019 ఎన్నికల్లో “ఒక్క అవకాశం” అంటూ జగన్ ప్రచారానికి వెళ్లారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే స్లోగన్ అందుకున్నారు. తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. అయితే అక్కడ జగన్ కు, ఇక్కడ లోకేష్ కు చాలా తేడా ఉంది. 

జగన్ తనను ముఖ్యమంత్రిని చేయాలని, ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజల్ని కోరారు. లోకేష్ మాత్రం తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, అలా ఒక్క అవకాశం ఇవ్వాలని మంగళగిరి ప్రజల్ని వేడుకుంటున్నారు. అదీ జగన్ కు, లోకేష్ కు ఉన్న తేడా. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు, అఖండ మెజారిటీ కట్టబెట్టారు, జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మరి మంగళగిరి ప్రజలు లోకేష్ కు ఒక్క ఛాన్స్ ఇస్తారా? తన జీవితంలో లోకేష్ ఒక్కసారైనా ఎమ్మెల్యే అనిపించుకుంటారా?

లోకేష్ జీవితాశయం అదే..

అసెంబ్లీలో అయినా, మండలిలో అయినా లోకేష్ ని వైసీపీ నేతలు చేసే ర్యాగింగ్ వేరే లెవల్ లో ఉంటుంది. కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేని లోకేష్ దొడ్డి దారిలో మంత్రి అయ్యారనే అపవాదు ఆయనపై ఉంది. అందుకే లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలవాలనుకుంటున్నారు. 

గతంలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో మంగళగిరిలో పోటీ చేసి బొక్కబోర్లా పడ్డారు. ఈసారి కూడా అదే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నా.. ఆయనలో అంత అతి విశ్వాసం లేదు. అందుకే ఇప్పటినుంచే జనాల్లోకి వెళ్తున్నారు.

మంగళగిరిలో లోకేష్ సెపరేట్ టీమ్ ని తిప్పుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాళ్లకు వెళ్లి లోకేషన్న గిఫ్ట్ అంటూ లోకేష్ ఫొటో ఉన్న సంచి ఒకటి వారి చేతిలో పెడతారు. మొహమాట పెట్టకుండా ఫొటోలు దిగేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. అలా ఆ కుటుంబాలన్నీ టీడీపీకి మద్దతుగా ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు నాయకులు. 

ఇక రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేవారికి అవసరం ఉన్నా లేకపోయినా చెక్కతో చేసిన తోపుడు బండ్లు కొనిచ్చేస్తున్నారు. దానిపై కూడా నారా లోకేష్ ఫొటోలుంటాయి. ఇలా ఎక్కడపడితే అక్కడ లోకేష్ ఫొటోలు కనపడేలే చీప్ అండ్ బెస్ట్ లో ఏది చేయొచ్చో అదే చేస్తోంది ఆయన టీమ్.

ఫైనల్ గా లోకేష్ డైలాగ్ అదే..

ముందుగా లోకేష్ ఏపీ యాత్ర చేస్తారని, అన్ని నియోజకవర్గాలు తిరుగుతారని, అందరు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని అనుకున్నారు టీడీపీ నేతలు. కానీ లోకేష్ ప్రచారానికొస్తే అసలుకే మోసం వస్తుందని కొంతమంది సీనియర్లు చెప్పే సరికి చంద్రబాబు కూడా సైలెంట్ అయ్యారట. లోకేష్ కూడా ముందు మంగళగిరిలో గెలిస్తే చాలనుకుంటున్నారు. అందుకే ఒక్క ఛాన్స్ అంటూ ఏడాదిన్నర ముందుగా పాదయాత్ర చేపట్టాలని అనుకుంటున్నారు. 

ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్.. మంగళగిరి నుంచి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి చాలు అని అడుగుతారట. 2024లో టీడీపీ గెలిచినా గెలవకపోయినా లోకేష్ మాత్రం ఎమ్మెల్యేగా గెలవాలి. అసెంబ్లీలో అధ్యక్షా అనాలి. ఇదీ టీడీపీ ఆలోచన.