స‌ర్వం జ‌గ‌న్ మార్క్‌…!

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మార్క్ పాల‌న‌కు మ‌రో కీల‌క ఘ‌ట్టానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అదే మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌.  పాలన‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తాన‌ని, వైసీపీ ఎమ్మెల్యేలంతా స‌హ‌క‌రించాల‌ని వైఎస్ జ‌గ‌న్ మొట్ట‌మొద‌టి వైసీఎల్పీ స‌మావేశంలో…

ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మార్క్ పాల‌న‌కు మ‌రో కీల‌క ఘ‌ట్టానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అదే మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌.  పాలన‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తాన‌ని, వైసీపీ ఎమ్మెల్యేలంతా స‌హ‌క‌రించాల‌ని వైఎస్ జ‌గ‌న్ మొట్ట‌మొద‌టి వైసీఎల్పీ స‌మావేశంలో కోరారు. 

జ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో అప్ప‌టికీ ఎవ‌రికీ తెలియ‌దు. జ‌గ‌న్ పాల‌న మొద‌లైన త‌ర్వాత కాలం గ‌డిచేకొద్ది జ‌గ‌న్ తీసుకొస్తున్న సంస్క‌ర‌ణ‌ల గురించి అంద‌రికీ తెలిసొచ్చింది.

స‌చివాల‌య వ్య‌వ‌స్థను తీసుకొచ్చి శ‌భాష్ అనిపించుకున్నారు. ల‌క్షకు పైగా స‌చివాల‌య ఉద్యోగాలు, అలాగే నాలుగు ల‌క్ష‌ల మంది వాలంటీర్ల నియామ‌కంతో పాల‌న‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చారు. కానీ ఈ వ్య‌వ‌స్థ తీసుకొచ్చిన మంచి కంటే, ప్ర‌జావేదిక కూల్చివేత జ‌గ‌న్ స‌ర్కార్‌కు డ్యామేజీ తీసుకొచ్చింది. నెగెటివిటీకి ఉన్న ల‌క్ష‌ణం ఇది. ఆ త‌ర్వాత మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. అభివృద్ధి, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం మూడు రాజ‌ధానుల‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ వివాదం ఇంకా న‌డుస్తూనే ఉంది.

ఆ త‌ర్వాత జిల్లాల పునర్వ్య‌స్థీక‌ర‌ణ‌. ప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేయ‌డానికి విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను తీసుకొచ్చిన‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర స‌చివాల‌యం వ‌ర‌కూ అభివృద్ధి, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటును చూడాల‌నేది ఆయ‌న భావ‌న‌. 

ప్ర‌స్తుతానికి వ‌స్తే మంత్రి వ‌ర్గ మార్పు. ఈ నెల 11న కొత్త మంత్రివ‌ర్గం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నుంది. దీన్ని మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ అనే కంటే మంత్రివ‌ర్గ వికేంద్రీక‌ర‌ణ అంటేనే స‌బ‌బు. కొత్త‌వారికి, అన్ని వ‌ర్గాల వారికి అధికారంలో భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌నే ల‌క్ష్యం జ‌గ‌న్ మ‌న‌సులో ఉండ‌డం వ‌ల్లే సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెప్పొచ్చు. ఇది జ‌గ‌న్‌కు మాత్ర‌మే సాధ్య‌మైన విష‌యం.