సమ్మర్ సినిమాలపై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్

సాధారణంగా ఓ భారీ సినిమా వస్తే దాని వెనుకగా వచ్చే సినిమాలకు కాస్త ఇబ్బందే. అందుకే కనీసం రెండు వారాలు గ్యాప్ వుండేలా చూస్తారు. కానీ ఆర్ఆర్ఆర్ సిన్మాకు రెండు వారాలు గ్యాప్ కూడా…

సాధారణంగా ఓ భారీ సినిమా వస్తే దాని వెనుకగా వచ్చే సినిమాలకు కాస్త ఇబ్బందే. అందుకే కనీసం రెండు వారాలు గ్యాప్ వుండేలా చూస్తారు. కానీ ఆర్ఆర్ఆర్ సిన్మాకు రెండు వారాలు గ్యాప్ కూడా ప్రమాదమే. అందులోనూ ఆర్ఆర్ఆర్ సినిమాకు పెట్టిన టికెట్ రేట్ల భారం ఇంతా అంతా కాదు. ఈ భారీ రేట్ల పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 150 కోట్లకు పైగా షేర్ లాగేసింది. 

అన్ని వందల కోట్ల డబ్బులు ఇచ్చేసినా తరువాత మిడిల్ క్లాస్ జనాలు మళ్లీ సినిమాకు డబ్బులు తీయాలంటే కాస్త ఆలోచిస్తారు. పైగా మరీ అద్భుతమైన క్రేజ్ వున్న సినిమాలు వస్తే, తప్పదని అనుకోవచ్చు. కానీ ఆ మాత్రం ఈ మాత్రం క్రేజ్ వున్న సినిమాలు వస్తే మాత్రం కాస్త వెనక్కు తగ్గుతారు. ఈ పరిస్థితి ఏ సినిమాకైనా తప్పదు. 

పైగా ఓటిటి అనే ఆప్షన్ ఒకటి వెంటాడుతోంది. మీడియం సినిమాలు అన్నీ ముఫై రోజుల్లో ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఓ రేంజ్ సినిమాలు మహా అయితే యాభై రోజులు. అందువల్ల కూడా సమస్యే అవుతోంది. 

దీనికి తోడు ఆంధ్రలో పరిక్షలు అన్నీ మే, జూన్ నెలల్లోనే వున్నాయి. ఇటు ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్, అటు ఓటిటి, దీనికి తోడు పరిక్షల సీజన్ అన్నీ కలిస సమ్మర్ సినిమాల మీద గట్టి ప్రభావం కనబర్చేలా వున్నాయి చూస్తుంటే.  

వరుణ్ తేజ్ గని సినిమా ముందుగా విడుదలవుతోంది. కాస్త దూరంగా ఆచార్య సినిమా వస్తోంది. ఈ రెండు మెగా సినిమాల ఫలితం చూస్తే పూర్తి అనాలసిస్ అర్థం అవుతుంది.