సరిగ్గా రెండేళ్ల క్రితం ఉత్తరాంధ్రాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింహాచలం దేవస్థానం ఆలయ కమిటీని వైసీపీ సర్కార్ నియమించింది. అయితే అది నాడు అతి పెద్ద రాజకీయ దుమారానికి కారణం అయింది. రీజన్ ఏంటంటే నాడు వంశపారంపర్య ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుని పక్కన పెట్టి ఆయన ఆన్న కూతురు సంచయితను చైర్ పర్సన్ చేయడం.
మొత్తానికి నాటి కమిటీ మీద కోర్టు దాకా వెళ్లి అశోక్ తానే తిరిగి చైర్మన్ అయ్యారు. పాత కమిటీ విషయంలో చెలరేగిన రాజకీయ వివాదం ఒక వైపు, కరోనా మహమ్మారి ప్రభావం మరో వైపు ఏదైతేనేం అప్పన్న సేవలో తరించే అవకాశం దక్కలేదని ట్రస్టీలు ఆవేదన వ్యక్తం చేశారు.
అలా కమిటీ తన పదవీకాలం ఈ మార్చితో పూర్తి అయింది. దీంతో పెద్దగా ఆలస్యం చేయకుండానే తాజాగా మళ్లీ కమిటీని వైసీపీ సర్కార్ పెద్దలు వేశారు. అయితే ఈసారి చైర్మన్ గా అశోక్ నే ఉంచి మొత్తం 14 మంది ట్రస్టీలను నియమించారు. దీంతో చాలా ప్రశాంత వాతావరణంలో సభ్యులు అంతా బాధ్యతలు తీసుకున్నారు.
2024 వరకూ పనిచేసే ఈ కమిటీ ఆలయ అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టాలని అంతా కోరుతున్నారు. మరో వైపు ప్రభుత్వంతో పేచీ పూచీలు లేవు కాబట్టి అశోక్ కూడా పూర్తి స్థాయిలో తన అనుభవాన్ని ఉపయోగించి ఆలయాన్ని రాష్త్రంలోనే ముందు వరసలో నిలబెట్టే ప్రయత్నం చేయాలని, చేస్తారని అంతా ఆశిస్తున్నారు.
కేంద్రం ప్రసాదం పధకం కింద ప్రత్యేక నిధులను ఆలయానికి కేటాయించింది. దాంతో పాటు అభివృద్ధి పనులకు పెద్ద పీట వేయడం ద్వారా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా టూరిజం పరంగా కూడా అప్పన్న స్వామి ఆలయాన్ని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి ఉంది.
మొత్తానికి అశోక్ కి ఓకే అంటూ వైసీపీ సర్కార్ తన రాజనీతిని ప్రదర్శించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇక ఆలయ వ్యవహారాల్లో రాజకీయాలు, పార్టీల జోక్యం తేకుండా కమిటీ సభ్యులతో సహా అంతా అదే రాజనీతిని ప్రదర్శిస్తే మేలు అన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది.