వచ్చే ఎన్నికల నాటికి దేశ, తెలంగాణా రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదుగానీ సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమధ్య జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా తరువాత కూడా కేసీఆర్ వెనక్కి తగ్గడంలేదు. వరి సేకరణ వివాదాన్ని భుజానికెత్తుకొని కేంద్రం మీద, వ్యక్తిగతంగా ప్రధాని మోడీ మీద విరుచుపడుతున్నారు. మంత్రులతో, నాయకులతో వీధి పోరాటాలు చేయిస్తున్నారు.
ప్రధాని మీద కోపంతో రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కూడా పలు సందర్భాల్లో అవమానించారు. అవమానించడమంటే ప్రోటోకాల్ పాటించకపోవడమని అర్ధం.
ప్రధానిని లెక్కచేయని కేసీఆర్ కు గవర్నర్ ఎంత? కేసీఆర్ పట్ల గవర్నర్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆగ్రహంగా కూడా ఉన్నారు. దాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు కూడా. చివరకు ఢిల్లీ వెళ్లి అన్ని విషయాలు ప్రధాని మోడీకి చెప్పారు. కేంద్రం-రాష్ట్రం మధ్య సామరస్యం ఏర్పడేంతవరకు గవర్నర్-ముఖ్యమంత్రి మధ్య సఖ్యత ఏర్పడదు. కానీ ఆ పరిస్థితి కనుచూపుమేరలో కూడా కనబడటం లేదు.
వరి కొనుగోళ్ల విషయమై కేంద్ర, రాష్ట్రాల మధ్య పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై మోడీతో భేటీ కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిన ప్రోటోకాల్ ఇష్యూ గురించి ఆమె ప్రధానికి ప్రధానంగా తెలియజేశారు.
అసలు వివాదం అదే కదా. వివిధ సందర్భాల్లో తనకు ఎదురైన అవమానాలను ప్రధాని మోదీకి వివరించారు. ముఖ్యమంత్రి, మంత్రులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ తెలిపారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, తెలంగాణ ప్రజల కోసం పని చేయడం తనకు ఎప్పుడూ ఇష్టమని గవర్నర్ చెప్పారు.
మేడారం, యాదాద్రి ఆలయ పర్యటనలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా గైర్హాజరైతే గవర్నర్ చర్యలు తీసుకోవచ్చని కూడా చెప్పారు. ఇక తెలంగాణలో డ్రగ్స్ వ్యాప్తిపై కూడా గవర్నర్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
మొత్తమ్మీద గవర్నర్ చెప్పినదాన్ని బట్టి ప్రధానికి క్లారిటీ వచ్చి ఉంటుంది. మరి దీనిపై పార్టీగా బీజేపీ ఏం చేస్తుంది? ప్రధానిగా మోడీ ఏం చేస్తారు? గవర్నర్ను మారుస్తారా? వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నే మారుస్తారా?
గవర్నర్ ను మార్చడం ప్రధాని చేతిలో పని. కేసీఆర్ ను మార్చడం ప్రజల చేతుల్లో పని. మొదటిది సులభం. రెండోది అంత వీజీ కాదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అంటున్నాడు. కానీ కేసీఆర్ చాణక్యం ముందు బండి సంజయ్ ఆటలు సాగుతాయా??