ఆదిపురుష్ సినిమాకు ఓవైపు నెగెటివ్ టాక్ నడుస్తుంటే, మరోవైపు కలెక్షన్లు కూడా వస్తున్నాయి. కాకపోతే బాగా తగ్గాయి. మొదటి 3 రోజుల్లోనే 350 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా, 10 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల రూపాయల గ్రాస్ సంపాదించిందంటే, ఈ సినిమా ఎంతలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
చూడ్డానికి ఈ నంబర్ పెద్దగా కనిపిస్తున్నప్పటికీ, సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. సాధారణ రోజులతో పోల్చితే, శని-ఆదివారాలు వసూళ్లు ఓ మోస్తరుగా పెరిగినప్పటికీ.. సినిమా కోలుకోవడానికి అది చాలదు. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ సినిమాకు 10 రోజుల్లో అటుఇటుగా 84 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ సినిమా వైపు మరింతమంది ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు భారీ ఆఫర్ ప్రవేశపెట్టారు మేకర్స్. ఆదిపురుష్ త్రీడీ వెర్షన్ కు సంబంధించి టికెట్ రేట్లను భారీగా తగ్గించింది. 112 రూపాయలకే ఈ సినిమాను త్రీడీలో చూడొచ్చు. దీనికితోడు కొన్ని ఎడిట్స్, డైలాగ్స్ లో మార్పుచేర్పులు కూడా జరిగాయని ప్రకటించింది యూనిట్.
మరోవైపు నార్త్ లో ఈ సినిమాకు వసూళ్లు బాగా తగ్గాయి. తాజాగా రిలీజైన 1920 అనే హారర్ సినిమాకు అక్కడ పాజిటివ్ టాక్ రావడంతో, ఆదిపురుష్ కు వసూళ్లు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆదివారం నాటి వసూళ్లతో ఈ సినిమా హిందీ వెర్షన్ కు 142 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. గతంలో ప్రభాస్ నటించిన ఫ్లాప్ మూవీ సాహో సినిమా హిందీ వెర్షన్ కు 155 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. కనీసం సాహోనైనా ఆదిపురుష్ క్రాస్ చేస్తుందా అనే చర్చ నడుస్తోంది బాలీవుడ్ లో.