ఈ నెల 23న కడప నగరం నడిబొడ్డున వైసీపీ యువనాయకుడు శ్రీనివాసులరెడ్డి హత్యకు గురి కావడంపై సీఎం వైఎస్ జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక రాజకీయం వుందని, ఇటీవల లోకేశ్ పాదయాత్ర ముగిసిన తర్వాత హత్య జరిగిందన్నారు. ఈ హత్య వెనుక టీడీపీ హస్తం వుందని పరోక్షంగా ఆయన అన్నారు. అయితే ఈ హత్యకు కడపలో భూవివాదాలే కారణమని లోకం కోడై కూసింది.
ఆ ప్రచారమే నిజమని పోలీసుల విచారణలో తేలింది. ఇవాళ శ్రీనివాస్‌రెడ్డి హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలను కడప ఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రతాప్‌రెడ్డితో పాటు ఏ2 శ్రీనివాసులు, ఏ3 సురేష్ కుమార్ అలియాస్ ఫ్రాన్సిస్, ఏ4 హరిబాబు, ఏ5 వెంకటసుబ్బయ్య, ఏ6 భాగ్యారాణిలను అరెస్టు చేశామన్నారు.
భూ వివాదాల కారణంగానే శ్రీనివాసులరెడ్డి హత్య జరిగిందని ఎస్పీ స్పష్టం చేశారు. శ్రీనివాసులరెడ్డి, ప్రతాప్‌రెడ్డికి మధ్య మూడు నెలల క్రితం ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో విభేదాలు వచ్చాయన్నారు. ప్రతాప్‌రెడ్డికి రూ.80 లక్షలు, శ్రీనివాసులుకు రూ. 60 లక్షల చొప్పున శ్రీనివాసులరెడ్డి ఇవ్వాల్సి ఉందన్నారు. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో శ్రీనివాసులురెడ్డిపై నిందితులు కక్ష పెంచుకున్నారన్నారు. మరికొంతమంది అనుమానితులకు నోటీసులు అందజేసినట్టు ఎస్పీ తెలిపారు.
టీడీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు కూడా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఇదే రకంగా టీడీపీ మెడకు చుట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నిందితులంతా వైసీపీకి చెందిన వారే అని వారు అన్నారు.
భూవివాదాల్లో తలదూర్చుతూ ప్రాణాలు తీసుకుంటూ, రాజకీయంగా తమను నష్టపరిచేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇరికించాలని చూడడం మంచిది కాదని కడప లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ఆర్.శ్రీనివాసులరెడ్డి తదితరులు హితవు చెబుతున్నారు. శ్రీనివాసులరెడ్డి హత్య కేసులో తమ ప్రమేమయం లేదని స్వయంగా కడప ఎస్పీనే తేల్చారని, కమలాపురం ఎమ్మెల్యే ఏమని సమాధానం చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు.