విద్యుత్ వ్యవహారంలో ఏపీ సర్కార్ వైఖరి గోరుచుట్టుపై రోకటిపోటు అనే చందంగా తయారైంది. అసలే విద్యుత్ చార్జీల పెంపుతో ఆగ్రహంగా ఉన్న ప్రజానీకానికి కోతలు మరిన్ని ఇబ్బందులు తెస్తున్నాయి. పట్టణాల్లో సైతం విద్యుత్ కోతలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ చార్జీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచామన్నారు.
గతంలో రూ.68 వేల కోట్లు చంద్రబాబు అప్పులు చేసి వెళ్లడం వల్లే భారం పడిందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో రూ.5 వేలు కోట్లు ప్రజలపై భారం వేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.1800 కోట్లు మాత్రమే భారం పడిందని మంత్రి బాలినేని చెప్పడం గమనార్హం. తెలంగాణ కంటే తక్కువ విద్యుత్ చార్జీల భారాన్ని వేయమని జగన్‌ను ఎన్నుకోలేదని మంత్రి గ్రహించాలని పౌర సమాజం చెబుతోంది.
విద్యుత్ చార్జీలు పెంచడమే కాకుండా, ఇష్టానుసారం కోతలు విధించడం ఏంటనే జనం ప్రశ్నిస్తున్నారు. పట్టణాల్లో చీకటి పడగానే కనీసం ఒక గంటపాటు కరెంట్ కోతలు విధిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే కరెంట్ కోతల గురించి చెప్పాల్సిన పనే లేదని పల్లె ప్రజలు వాపోతున్నారు.
వాన రాక, ప్రాణం పోకడ గురించైనా చెప్పొచ్చు కానీ, పల్లెల్లో ఎప్పుడు కరెంట్ వస్తుందో, పోతుందో చెప్పలేని దుస్థితి నెలకుందని గ్రామీణులు మండిపడుతున్నారు. కరెంట్ ప్రస్తావన వస్తే చాలు ….చంద్రబాబు పాలన వైఫల్యాలను తెరపైకి తేవడం ప్రస్తుత ప్రభుత్వానికి ప్యాషనైంది.
చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలన సాగించారనే కదా, ఆయన్ను ఇంటికి సాగనంపారని ప్రస్తుత పాలకులు ఎందుకు గుర్తించడం లేదో అర్థం కాని విషయం. సగం కాలం పూర్తవుతున్నా ఇంకా చంద్రబాబునే దోషిగా చూపితే, జగన్ సర్కార్ ఏం చేస్తోందనే ప్రశ్నలకు మంత్రి బాలినేని ఏం సమాధానం చెబుతారు? బాబు కాలం నాటి వైఫల్యాలను సరిదిద్దడానికి అధికారం ఇస్తే, వాటిని రాజకీయంగా సాకుగా చూపుతూ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన ప్రస్తుత సర్కార్‌లో కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.