ఒకప్పుడు యాంగ్రీ యంగ్ హీరో రాజశేఖర్ సినిమాలు అంటే విపరీతమైన క్రేజ్. ఆయన సమకాలికులు అంతా అయితే ఇంకా హీరోలుగానో, లేదా మాంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గానో సెటిలయ్యారు. కానీ రాజశేఖర్ మాత్రం ఎటూ కాకుండా వుండిపోయారు.
ఆయన పిల్లల సినిమాల విషయంలో కూడా సరైన ట్రాక్ వేయలేకపోయారు. ఇప్పటికీ రాజశేఖర్ ను అభిమానించేవారు వున్నారు. ఆయన సరైన సినిమా చేస్తే చూడాలనుకునే వారు వున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఆయన ఓ రీమేక్ చేసారు. ఆయన వయసుకు తగిన పాత్ర, మంచి కథతో కూడిన సినిమా. కానీ ఈ సినిమా పరిస్థితి ఏమిటన్నదే తెలియడం లేదు. సినిమాకు ఇప్పటికే ఒకటి రెండు విడుదల డేట్ లు ప్రకటించారు. కాదు, కాదు ఓటిటి అన్నారు. కానీ ఏదీ జరగలేదు.
సినిమాకు ముందు వేరే దర్శకుడిని అనుకున్నారు. కానీ రాజశేఖర్ కు అన్నీ తానై వ్యవహరించే భార్య జీవితకు, అతగాడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఆఖరికి ఆమె నే డైరక్షన్ చేసారు. నిజానికి ఈ సినిమాకు మాంచి ఓటిటి ఆఫర్లే వున్నాయి. కానీ అంతకన్నా గొప్ప ఆఫర్లు వస్తాయని జీవిత ఆశగా వున్నారని బోగట్టా.
మరి అందుకోసం విడుదల వెయిటింగ్ లో వుంచారో? లేక సరైన డేట్ కోసం చూస్తున్నారో? ఈ సినిమాకు శ్రీనివాస్ బొగ్గారం, సుధాకరరెడ్డి నిర్మాతలు.